కరోనా ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి. కొవిడ్ తో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఆర్థికంగా కూడా నష్టపోయారు. కరోనాను ఎదుర్కొవడంలో భారత ప్రభుత్వం విజయం సాధించింది.
అతి తక్కువ కాలంలో భారత్ లో కరోనా వ్యాక్సిన్ తయారు అయ్యేలా చర్యలు తీసుకుంది.
దేశంలోని ప్రజలకు ఉచితంగా టీకాలు కూడా ఇచ్చింది. రెండు డోసులతో పాటు బుస్టర్ డోసు కూడా ఇచ్చింది. అయితే కొవిడ్ వ్యాక్సిన్ పై కేంద్ర ప్రభుత్వం సంచలనం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి కరోనా వ్యాక్సిన్ ఉచితంగా సరఫరా చేయలేమని స్పష్టం చేసింది.
ఈ మేరకు రాష్ట్రాలకు సమాచారం ఇచ్చింది. రాష్ట్రాలే సొంతంగా వ్యాక్సిన్‌లను సరఫరా చేసుకోవాలని కోరింది. కరోనా టీకా కంపెనీల నుంచి నేరుగా రాష్ట్రాలే సొంత నిధుతలో కొనుగోలు చేసుకోవాలంటూ చెప్పింది. మూడో డోస్ కోవిడ్ వ్యాక్సిన్‌ని కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేయడం లేదని కేంద్ర వర్గాలు స్పష్టం చేశాయి. అయితే ఇప్పటికే దాదాపు అందరికి కరోనా వ్యాక్సినేషన్ పూర్తయినట్లు పేర్కొంది.
2021 జనవరి 16న దేశవ్యాప్తంగా ప్రారంభమైన వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలకు కోవిడ్ వ్యాక్సిన్‌లను కేంద్ర ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసింది. ప్రభుత్వం ఉచితంగా అందించిన వ్యాక్సిన్లలో కొవాగ్జిన్, కోవిషీల్డ్ ఉన్నాయి. గత ఏడాది అక్టోబర్‌లో ప్రభుత్వం వ్యాక్సిన్ల కోసం రూ. 4,237 కోట్లను కేటాయించింది. దేశవ్యాప్తంగా 220.66 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు అందించారు.
అయితే గతంలో కొవిడ్ టీకా వేసుకోవడానికి ముందుకొచ్చిన ప్రజలు ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి విముఖత చూపిస్తున్నారు. చాలా సింగిల్ డోసు తీసుకుని లైట్ తీసుకుంటున్నారు. తాజాగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీనిపై కేంద్రం రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. కొవిడ్ కట్టడికి చర్యలు తీసుకోవాలని కోరింది.
