ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తన నివాసానికి కూత వేటు దూరంలో ఏదన్నా బహిరంగ సభ నిర్వహించాల్సి వచ్చినా, హెలికాప్టర్‌ని ఆశ్రయిస్తున్న సంగతి తెలిసిందే.
ట్రాఫిక్ సమస్యల కారణంగా అధికారులు తీసుకుంటోన్న నిర్ణయమిది.. అని వైసీపీ చెబుతూ వస్తోంది.
సరే, ముఖ్యమంత్రి పర్యటనల నిమిత్తం చేసే ఖర్చు, ఆ డాబు.. ఇదంతా వేరే చర్చ.! ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడమేంటి.? తలెత్తుతాయ్.. ఎందుకంటే, జనాన్ని ఆ స్థాయిలో తీసుకురావాలి ముఖ్యమంత్రి బహిరంగ సభలకి. బస్సుల్లోనూ, ఆటోల్లోనూ.. ఇతర వాహనాల్లోనూ జనాన్ని తరలించి, బల ప్రదర్శన చేయాలి.
దీనికోసమయ్యే ఖర్చుని కూడా ప్రభుత్వమే భరిస్తుంది. దానిపై వచ్చే విమర్శల తీరు.. అది మళ్ళీ వేరే వ్యవహారం.
అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత విచారణకు హాజరయ్యే విషయంలో గతంలో ‘ట్రాఫిక్ సమస్యలు, ప్రజాధనం వృధా’ వంటి అంశాల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్, న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్ళడం హాస్యాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.
ప్రతిపక్ష నేతగా వున్న సమయంలో, ‘వారానికోరోజు సెలవు తీసుకోండి.. పాదయాత్రకు విరామం తీసుకుని, విచారణకు హాజరవ్వండి’ అని పేర్కొంది న్యాయస్థానం. ముఖ్యమంత్రి అయ్యాక మాత్రం, అక్రమాస్తుల కేసు విచారణ నుంచి మినహాయింపు పొందుతున్నారు.
ఇక, తన మీద జరిగిన హత్యాయత్నం కేసు (కోడి కత్తి వ్యవహారం) విచారణ సందర్భంగా, సాక్షిగా విచారణకు హాజరయ్యేందుకూ మినహాయింపు కోరారు వైఎస్ జగన్. అడ్వొకేట్ కమిషనర్‌ని తన వద్దకు పంపి, సాక్ష్యం నమోదు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రిగా పలు సంక్షేమ పథకాలపై సమీక్షల కారణంగానే విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు చెప్పారు వైఎస్ జగన్. అంతేనా, సీఎం గనుక కోర్టులో విచారణకు హాజరైతే ట్రాఫిక్ ఇబ్బందులూ వస్తాయని ప్రస్తావించారు.
సరిపోయింది సంబరం.! ముఖ్యమంత్రికి ఓ రకమైన చట్టం.. సామాన్యులకు ఇంకోరకమైన చట్టాలుంటాయా.?
