కరీంనగర్‌లో అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. మిడ్ నైట్ 12 గంటలు దాటిన తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఇంటికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు నగర పోలీసులు. ఆయన ఇంటిలోకి ప్రవేశించి.. అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పారు. కొద్దిసేపటి వాగ్వాదం తర్వాత ఆయన్ను అరెస్టు చేశారు. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య భారీ తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారి తీసింది. టెన్త్ పేపర్ల లీకేజీకి సంబంధించి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి ఆయనను యాదగిరిగుట్టకు తరలించారు. మార్గమధ్యంలో ఆయనను ఎక్కించిన పోలీసు వాహనం మొరాయించింది. దీంతో మరో వాహనంలో ఎక్కించి.. బొమ్మలరామారం పీఎస్‌కి తరలించారు పోలీసులు.
కరీంనగర్ అదనపు డీసీపీ చంద్రమోహన్ ఆధ్వర్యంలో ఏసీపీలు తుల శ్రీనివాసరావు, కరుణాకర్‌రావు , సీఐలు నటేష్, లక్ష్మీబాబు, దామోదర్‌రెడ్డి దాదాపు 50 మందికి పైగా పోలీసులు అర్ధరాత్రి సమయంలో బండి సంజయ్ ఇంటి వద్దకు చేరుకున్నారు. మిమ్మల్ని అరెస్టు చేస్తున్నామని సహకరించాలని కోరారు. తన అరెస్టుకు కారణంగా చూపించాలని, తనకు వారెంటు చూపాలంటూ పోలీసులతో సంజయ్ వాగ్వాదానికి దిగారు. మరో వైపు బండి సంజయ్‌ని అరెస్టు చేస్తున్నారనే ప్రచారంతో బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో సంజయ్‌ను పోలీసులు ఇంటి నుండి బలవంతంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. పోలీసుల ప్రయత్నాన్ని కార్యకర్తలు ప్రతిఘటించారు. నినాదాలు చేస్తూ ఆయన అరెస్టును అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు బలవంతంగా సంజయ్‌ను వాహనంలో ఎక్కించి అక్కడి నుంచి తరలించారు.
ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పాలంటూ కార్యకర్తలు, అనుచరులు కోరినా పట్టించుకోకుండా అరెస్టు చేసి తీసుకెళ్ళారు. తిమ్మాపూర్ మీదుగా సంజయ్‌ను తీసుకెళ్తుండగా వాహనం మొరాయించడంతో మరో వాహనంలో సంజయ్‌ను తీసుకెళ్లారు. బండి సంజయ్ అత్త మరణించి తొమ్మిది రోజులు అవుతుండటంతో ఆయన కరీంనగర్‌కు వచ్చారు.
నిన్న టెన్త్ క్లాస్ హిందీపేపర్ లీక్ తర్వాత నిందితులను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు వరంగల్ సీపీ రంగనాథ్. దీనికి సూత్రధారిగా భావిస్తున్న ప్రశాంత్ వ్యవహారంపై టోటల్‌గా స్టడీ చేశారు. నిన్న ఉదయం నుంచి ప్రశాంత్ ఏమేమి చేశాడన్న దానిపై కూపీ లాగితే.. బండి సంజయ్ పేరు బయటకు వచ్చింది. నిన్న ఉదయం 9:45కు టెన్త్ హిందీ పేపర్ లీకైంది. 9:59కి SSC వాట్సాప్ గ్రూప్‌లోకి ఈ పేపర్ వచ్చింది. అక్కడి నుంచి 10:45కి అన్ని గ్రూపుల్లో పోస్ట్అయింది. పలు మీడియా ప్రతినిధులకు ప్రశాంత్ పేపర్ పంపాడని.. 11:30కి బండి సంజయ్‌కి కూడా పేపర్ వెళ్లిందని గుర్తించారు. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించారని చెప్పారు వరంగల్ సీపీ రంగనాథ్.
