ధరణి పోర్టల్‌లో వ్యవసాయ భూముల లావాదేవీలకు సంబంధించి తలెత్తుతున్న చిన్నచిన్న సమస్యల పరిష్కారానికి భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) నవీన్ మిట్టల్ కసరత్తు మొదలు పెట్టారు. సమస్యలను గుర్తించి వాటిని సరిచేసేందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు వారంలోపే పూర్తవుతాయని.. ఆ తర్వాత ప్రస్తుతం ధరణి పోర్టల్‌లో వస్తున్న ఇబ్బందుల్లో పదికిపైగా చిన్నచిన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన అన్నారు. ధరణి పోర్టల్‌లో భూమి యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి అనుమానాలను నివృత్తి చేసే వ్యవస్థను త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వేగంగా పని చేస్తున్నారు. దీనికోసం తరుచూ ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి..? ఇదే ఫ్రీక్వెంట్లీ ఆస్కింగ్ క్వశ్చన్స్- ఎఫ్‌ఏక్యూ అనే సాంకేతికతను పోర్టల్‌లో ఏర్పాటు చేయనున్నారు.
రైతులు, రెవెన్యూ సిబ్బందికి ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారం ఎలా పొందాలనే సూచనలను ఎఫ్‌ఏక్యూ ద్వారా అందించనున్నారు. ఎదురైన సమస్యను పోర్టల్‌లో ఇచ్చే ఐచ్ఛికంపై నమోదు చేస్తే.. దానికి ఏంచేయాలి, ఎవరిని కలవాలి, ఇంతకుముందు ఎదురైన సమస్యకు అందుబాటులో ఉన్న పరిష్కార మార్గం ఏమిటనేది ప్రదర్శితమవుతుంది.
ఇప్పటివరకు ధరణి జిల్లా కోఆర్డినేటర్ లేదా టోల్‌ఫ్రీ నంబర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో ప్రజలకు సరైన సమాధానం వెంటనే అందించేలా కొద్దిరోజుల్లో ఎఫ్‌ఏక్యూను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు రెవెన్యూశాఖ తెలిపింది. వాస్తవానికి వ్యవసాయ భూముల లావాదేవీలు మాన్యువల్‌గా జరిగే సమయంలో ఎక్కడికక్కడ సమస్యలు వచ్చినా పెద్దగా సమస్యగా మారేది కాదు. వాటి పరిష్కారం కూడా ఎక్కువ సమయం పట్టినప్పటికీ.. కింది స్థాయిలోనే వాటిని పరిష్కరించేవారు.
అయితే, ధరణి పోర్టల్ ఆన్‌లైన్ వేదిక కావడంతో ఏ చిన్న సమస్య అయినా తెలంగాణ వ్యాప్తంగా పెద్ద భూతంలా మారుతోంది. దీనికితోడు భూసమస్యల పరిష్కార అధికారం కలెక్టర్ల చేతిలో ఉండటంతో మరింత జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ధరణి సమస్యలపై సీసీఎల్‌ఏ నవీన్‌మిత్తల్ ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో ఆన్‌లైన్ వస్తున్న సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
