నవీన్ హత్య కేసులో ప్రియురాలు పేరు చేర్చారు పోలీసులు. హత్య అనంతరం ప్రియురాలికి నవీన్ డెడ్ బాడీ ఫోటోలు వాట్సాప్‌లో పంపాడు హరిహర కృష్ణ. పోలీసులు కస్టడీలో యువతి పేరు చెప్పడంతో పాటు ఈ వివరాలు వెల్లడించాడు హరి హర కృష్ణ. దీంతో ఆమెను కూడా నిందితురాలుగా చేర్చారు అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు. యువతి కోసమే నవీన్‌ను హత్య చేసినట్టు కస్టడీలో ఒప్పుకున్నాడు హరి హర కృష్ణ. దీంతో ప్రియురాలు నిహారికను అరెస్ట్ చేశారు పోలీసులు. హత్య అనంతరం హరిహర కృష్ణ మిత్రుడు హసన్ ఇంటికి వెళ్లి.. అతడికి వివరాలు చెప్పి.. నెత్తుటితో తడిసిన బట్టలు మార్చుకున్నాడు హరిహర కృష్ణ. ఆ సమాచారం అతడు పోలీసులకు ఇవ్వలేదు. దీంతో హసన్‌ను కూడా ఒక నిందితుడిగా చేర్చారు పోలీసులు. నేరాన్ని దాచి పెట్టడం కూడా నేరమే.. అందుకే వీరిద్దర్నీ కూడా నిందితులుగా చేర్చినట్లు తెలుస్తోంది. నవీన్ హత్య కేసులో ఏ2గా హసన్, ఏ3గా యువతిగా చేర్చారు.
నవీన్‌ను హరిహరకృష్ణ ఒక్కడే హత్య చేశాడని డీసీపీ సాయిశ్రీ తెలిపారు. హత్య విషయాన్ని స్నేహితుడు హసన్‌కు చెప్పాడని వెల్లడించారు. హత్య చేసిన తర్వాత హరిహరకృష్ణ పారిపోయి.. ఖమ్మం, విజయవాడ, విశాఖ, వరంగల్‌కు వెళ్లాడని డీసీపీ వివరించారు. హత్య జరిగిన విషయం తెలిసిన తర్వాత 1500 రూపాయలు నిహారిక హరిహరకు ట్రాన్స్‌ఫర్ చేసిందని వివరించారు. గత నెల 24న తిరిగి వచ్చి యువతి, హసన్‌ను హరిహరకృష్ణ కలిశాడని తెలిపారు. లొంగిపోవడానికి ముందు నవీన్‌ను చంపిన చోటుకు యువతిని, హసన్‌ను హరిహర కృష్ణ తీసుకెళ్లాడని డీసీపీ వెల్లడించారు. నిహారిక ఫోన్‌లోని డేటాను కూడా డిలీట్ చేసిందని… ఎవిడెన్స్ టాంపరింగ్‌కు పాల్పడిందని పోలీసులు తెలిపారు. హత్య విషయం తెలిసినా ఇద్దరూ పోలీసులకు చెప్పలేదని.. అందుకే వారిని అరెస్ట్ చేశామని వెల్లడించారు.
