ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు టీమిండియా అధిపత్యం చెలాయించింది. ముందుగా బౌలింగ్ చేసిన భారత్.. రవీంద్ర జడేజా సాయంతో అదిరిపోయే ప్రదర్శన చేసింది. జడ్డూ 5 వికెట్లతో విజృంభించి భారత్‌ను ముందంజలో నిలిచేలా చేశాడు. ఫలితంగా ఆసీస్ 177 పరుగులకు ఆలౌటైంది. నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో జడ్డూ పర్ఫార్మెన్స్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా కూడా స్పందించాడు. మెజిషియన్ వలే బౌలింగ్ చేశాడని స్పష్టం చేశాడు “జడేజా బ్రిలియంట్‌గా పునరాగమనం చేశాడు. మెజిషియన్ మాదిరిగా ప్రదర్శన చేశాడు. 5 వికెట్లు తీసినందుకు నీకు శుభాకాంక్షలు” జడ్డూ అని రైనా తన ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపాడు. టీమిండియా మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ కూడా జడేజాకు అభినందనలు తెలిపాడు. గాయం నుంచి కోలుకుని ఇంత మెరుగ్గా ప్రదర్శన చేయడం అంత సులభమేం కాదని సోషల్ మీడియా వేదికగా తన స్పందనను తెలియజేశాడు. టెస్టు క్రికెట్‌లో జడేజా 11వ సారి 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఆసీస్‌తో అతడికి ఇది నాలుగో సారి. 34 ఏళ్ల జడ్డూ చివరగా గతేడాది జులైలో బర్మింగ్హామ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆడాడు. అనంతరం గాయం బారిన పడటంతో అప్పటి నుంచి జట్టుకు దూరంగా ఉన్నాడు. గురవారం జరిగిన ఈ మ్యాచ్‌లలో జడేజా తన తొలి వికెట్‌నే ప్రమాదకర మార్నస్ లబుషేన్ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. కేఎస్ భరత్ అద్భుత స్టంపౌట్‌తో అతడిని పెవిలియన్ చేర్చాడు. తదుపరి బంతికే రెన్షాను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. . ఆ తర్వాత స్మిత్‌ను తన మ్యాజిక్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇక చివర్లో టాడ్ మర్ఫీ(0), హ్యాండ్సకంబ్‌ను(31) ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. ఫలితంగా 47 పరుగులిచ్చి 5 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ 177 పరుగులకే కుప్పుకూలింది. రవీంద్ర జడేజా 5 వికెట్లతో అదరగొట్టగా.. రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. షమీ, సిరాజ్ చెరో వికెట్‌లో ఆదిలోనే ఆసీస్‌ను దెబ్బకొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి రోజు పూర్తయ్యే సమయానికి వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(56) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు.
