తెలంగాణలో జరిగిన అన్యాయంపై పోరాడేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. కేసీఆర్‌కు తెలంగాణపై ప్రేమలేదని.. రాష్ట్రంలోని సంపదపై కన్నేశాడని విమర్శించారు. విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన రాజకీయ ప్రస్థానం గుర్తు చేసుకుంటూ విజయశాంతి ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు.
తనది 25 ఏళ్ల రాజకీయం ప్రస్థానం.. చాలా పెద్ద ప్రయాణం అని అన్నారు విజయశాంతి. 1998 జనవరి 21న వాజ్ పేయి, అద్వానీలను కలిసిశానని.. తనకు బీజేపీ సిద్ధాంతాలు నచ్చాయన్నారు. అవినీతి లేని, క్రమశిక్షణ కలిగిన పార్టీ ప్రజలకు మేలు చేస్తుందని తన నమ్మకం అని అన్నారు. తెలంగాణలో జరిగిన అన్యాయంపై పోరాడేందుకే రాజకీయాల్లోకి వచ్చాననని.. తనకు పదవులపై ఆశ లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనే కోరికే ఉండేదని.. ఆ రోజు సమైక్యవాద నాయకులు తెలంగాణ రాకుండా అడ్డుకున్నారని విజయశాంతి అన్నారు. అందుకే సమైక్యవాదులతో పోరాడేందుకు తల్లి తెలంగాణ పార్టీ పెట్టానని.. అయితే ఆరోజు పార్టీని వీడినందుకు ఏడ్చానని చెప్పారు. నాలుగున్నరేళ్లు పార్టీని నడిపి ఎన్నో సమస్యలపై పోరాడానని.. ఆ సమయంలో ఒక రాక్షసుడు ఎదురయ్యాడని పేర్కొన్నారు. తెలంగాణ పేరుతో ముసుగు కప్పుకుని వచ్చి నమ్మించి మోసం చేశారని వాపోయారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి పూనుకున్నాడని.. విలీనం చేసినప్పటి నుంచి తాను ఏనాడూ ప్రశాంతంగా లేనన్నారు.
