ఫిబ్రవరి నుంచి తెలంగాణలో రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి. బీఆర్‌ఎస్‌ను గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్ పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే ప్రత్యామ్నాయ శక్తి తామంటే తామనేలా ప్రజాక్షేత్రంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో కాస్త ముందుంది. అంతర్గత కుమ్ములాటల కారణంగా కాంగ్రెస్ వెనుకబడింది. ఇక అధికార బీఆర్‌ఎస్ రాష్ట్ర రాజకీయాలకంటే జాతీయ రాజకీయాలపైనే ఎక్కువ ఫోకస్ పెడుతోంది. పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించే ప్రయత్నాల్లో ఆపార్టీ అధినేత కేసీఆర్ ఉన్నారు. ఈ తరుణంలో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కేసీఆర్ తెలంగాణ పాలనను, అభివృద్ధిని, ప్రజలను మర్చిపోయారని ప్రచారం మొదలు పెట్టింది. జై తెలంగాణ నినాదాన్నే కేసీఆర్ పక్కన పడేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో బిజీగా ఉన్న తరుణంగా రాష్ట్రంలో మరింత బలపడాలని బీజేపీ అధిష్టాని రాష్ట్ర నేతలను ఆదేశించింది. పార్టీని క్షేత్రస్థాయికి తీసుకెళ్లే కార్యక్రమాలు సభలు, సమావేశాలు నిర్వహించాలని ఆదేశించింది.
నియోజకవర్గాల వారీగా బలాలు, బలహీనతలు గుర్తించాలని, స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు నిర్వహించాలని, అన్నివర్గాలకు పార్టీని చేరువ చేయాలని కమలనాథులు దిశానిర్దేశం చేశారు. ఈమేరకు పార్టీ రాష్ట్రశాఖ కార్యచరణ రూపొందిస్తోంది. Telangana BJP పాలుమూరు వేదికగా కార్యవర్గ సమావేశాలు.. తెలంగాణలో గెలుపే లక్ష్యంగా పాలమూరు వేదికగా బీజేపీ రాష్ట్ర పదాధికారులు, కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికలపైనే ప్రధానంగా ఇందులో చర్చించనున్నారు. బండి సంజయ్ అధ్యక్షతన మంగళవారం జరిగే సమావేశాలకు పార్టీ జాతీయ నేతలు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, అర్వింద్ మీనన్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఢిల్లీలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తీర్మానించిన అంశాలపై చర్చించనున్నారు. ఎన్నికలే అజెండాగా.. అసెంబ్లీ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సంసిద్ధమవ్వడమే ప్రధాన అజెండాగా రెండు రోజులు మహబూబ్‌నగర్ జిల్లా అప్పనపల్లిలోని బీజేపీ రాష్ట్ర పదాధికారులు, కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ప్రధానంగా ఇందులో చర్చించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే.. ఎలాంటి వ్యూహాన్ని సిద్ధం చేయాలనే అంశంపైనా సమాలోచనలు చేయనున్నారు.
