బాక్సర్ మేరీ కోమ్ చేతికి రెజ్లింగ్ ఫెడరేషన్

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) ఛీఫ్ బ్రిజ్ భూషణ్ పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సోమవారం (జనవరి 23) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఆరోపణలపై విచారణ జరపడంతోపాటు రెజ్లింగ్ రోజువారీ వ్యవహారాలను చూసుకోవడం కోసం ఓ కమిటీని నియమించింది. నలుగురు సభ్యుల ఈ కమిటీని బాక్సర్ మేరీ కోమ్ లీడ్ చేయనుండటం గమనార్హం. ఇక నుంచి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు రోజువారీ వ్యవహారాలతో సంబంధం లేదు. ఈ కమిటీలో మేరీ కోమ్ తోపాటు రెజ్లర్ యోగేశ్వర్ దత్, బ్యాడ్మింటన్ ప్లేయర్ తృప్తి మురుగుండె, రాజగోపాలన్ ఉన్నారు. ఈ కమిటీయే ఇక నుంచి రెజ్లింగ్ వ్యవహారాలు చూడనుంది.

డబ్ల్యూఎఫ్ఐ ఛీఫ్ బ్రిజ్ భూషణ్ పై రెజ్లర్ వినేష్ ఫోగాట్ తోపాటు పలువురు ఇతర రెజ్లర్లు కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆదివారం ఈ ఫెడరేషన్ కార్యకలాపాలను రద్దు చేసింది. సోమవారం ఈ కమిటీని ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకుంది. దీనికితోడు డబ్ల్యూఎఫ్ఐ అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమార్ ను సస్పెండ్ చేసింది. ఈ ఆరోపణలపై విచారణ జరుపుతామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో శనివారం (జనవరి 21) రెజ్లర్లు తమ నిరసనను విరమించారు. తాను నిరసన విరమిస్తున్నట్లు రెజ్లర్ భజరంగ్ పూనియా చెప్పాడు. యువ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నారంటూ బ్రిజ్ భూషణ్ పై ప్రముఖ రెజ్లర్లు ఆరోపించిన విషయం తెలిసిందే. జంతర్ మంతర్ దగ్గర ధర్నాకు దిగిన ఈ రెజ్లర్లను కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా మాట్లాడారు. నాలుగు వారాల్లో దీనిపై విచారణ పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Editor