రెండో వన్డేలో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన టీమ్ ఇండియా – సిరీస్ కైవసం

రాయ్‌పుర్ వేదికగా శనివారం జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్‌పై టీమ్ ఇండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. న్యూజిలాండ్ విధించిన 108 పరుగుల టార్గెట్‌ను టీమ్ ఇండియా ఇరవై ఓవర్లలోనే ఛేధించింది. స్వల్ప టార్గెట్ చేధించే క్రమంలో టీమ్ ఇండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ బ్యాట్ ఝులిపించారు. కెప్టెన్ రోహిత్ శర్మ ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. 49 బాల్స్‌లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 51 పరుగులు చేసి ఔటయ్యాడు.

ఆ తర్వాత విరాట్ కోహ్లి 11 పరుగులకే ఔటైనా శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ కలిసి టీమ్ ఇండియాకు విజయాన్ని అందించారు. శుభమ్‌న్ గిల్ 40 రన్స్‌, ఇషాన్ కిషన్ 8 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 34.3 ఓవర్లలో 108 రన్స్‌కు ఆలౌటైంది. షమీ, హార్దిక్ పాండ్య, సుందర్ బాల్‌తో విజృంభించడంతో న్యూజిలాండ్ వంద పరుగుల్ని కష్టంగా దాటింది. గ్లెన్ ఫిలిప్స్ 36 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో టీమ్ ఇండియా కైవసం చేసుకున్నది.

Editor