ఉత్తరాంధ్ర ప్రజలకు భరోసా తీర్మానం Yuva Shakti Resolutions నిజాయతీగా కష్టించే మనస్తత్వం… గుండెల నిండా ఆశయ స్ఫూర్తి… బతుకు కోసం పోరాడే ధైర్యం… ఉత్తరాంధ్ర ప్రజల సొంతం. వారికి అవి ఆయుధాలు. వాటిని ఈ ప్రాంత పాలకులు తమ ఉనికి కోసం పకడ్బందీగా ధ్వంసం చేశారు. రెక్కల కష్టం మీద బతికే రోజు కూలీ నుంచి విద్యావంతుడైన యువకుడి వరకూ ఎవరైనాసరే తమ కనుసన్నల్లోనే ఉండాలనే పాలకుల వైఖరి వల్ల ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధిలో వెనక్కి నెట్టి వేయబడింది. ప్రకృతి ప్రసాదించిన వనరులు పుష్కలంగా ఉన్నా అవి ప్రజలకు చేరకుండా చేస్తున్నారు. ఉత్తరాంధ్ర సాంస్కృతిక వైభవంలో భాగమైన హస్తకళా నైపుణ్యాలు, కళారూపాలు, సాహిత్యాలను ప్రోత్సహించకపోవడం పాలకుల వ్యూహంలో భాగమే.
పేదవాడికి ఎకరం భూమి కూడా మిగలకుండా కుటుంబ పాలన కోసం మాఫియా రాజ్యాన్ని స్థాపిస్తూ అభివృద్ధి అంతా తమ వాళ్ళకీ… వెనకబాటుతనం మాత్రం ప్రజలకు అనే సూత్రాన్ని అమలులోకి తెచ్చారు. ఓ వైపు తీరం… మరో వైపు పచ్చటి భూములు ఉన్న ఉత్తరాంధ్రలో సామాన్య కుటుంబాలకు మిగిలింది కన్నీరే. సొంత ఊరిని కన్నీటితో విడిచిపెట్టి తమకు ఏ మాత్రం సంబంధం లేని పరాయి ప్రాంతంలో వలస జీవితం గడపాలని ఎవరు కోరుకొంటారు? ఉపాధి కోసమే కాదు విద్య కోసం, వైద్యం కోసం కూడా పొరుగు ప్రాంతాలకు వెళ్లిపోయేలా చేస్తున్నారు. కనీసం రోడ్లు వేయలేని ఈ వ్యక్తులు రాజధానులు, రాష్ట్రవాదాల గురించి మాట్లాడుతున్నారు. ఉద్ధానం అంటే కొబ్బరి తోటల ప్రాంతం అని కాకుండా కిడ్నీ వ్యాధులకు కేరాఫ్ అనడం ఎవరికి గర్వకారణం? ఈ రోజుకీ వైద్యం కోసం రోగులను మంచాలపై మోసుకొని పరుగులు తీసే దౌర్భాగ్యం కళ్ళకు కనిపిస్తోంది.
