హైదరాబాద్ శివారు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మైలాన్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ముగ్గురు కార్మికులు అక్కడి కక్కడే మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. జిన్నారం మండలం గడ్డపోతారం గ్రామ పరిధిలోని మైలాన్ పరిశ్రమలో వేర్‌హౌస్ బ్లాక్‌లో ఒకసారిగా మంటలు చెలరేగడంతో ముగ్గురు కార్మికులకు మంటలు అంటుకున్నాయి. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఇక మృతి చెందిన వారిలో ఒకరు పశ్చిమ బెంగాల్ కి చెందిన వ్యక్తి కాగా మరొకరు బీహార్ కి చెందినవారు. ఇక అసిస్టెంట్ మేనేజర్ మాత్రం ఏపీలోని శ్రీకాకుళంకు చెందిన వ్యక్తని తెలుస్తోంది.
పశ్చిమ బెంగాల్కు చెందిన పరితోష్ మెహతా (40), బిహార్ వాసి రంజిత్ కుమార్ (27) తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించగా మార్గం మధ్యలో ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. ఇక స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది పోలీసులు కష్టపడి అక్కడ మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇక పోలీసులు ఈ సంఘటన మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఎలా మంటలు వ్యాపించాయి అనే విషయం మీద పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని డిప్యూటీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు ఐడిఏ బొల్లారం పోలీసులు ఈ కేసును ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.
