సింగరేణి కాలరీస్ సంస్థలో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికుల సంక్షేమం కోసం యాజమాన్యం మరో చారిత్రక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో జరిగిన కోల్బెల్ట్ ప్రజాప్రతినిధుల భేటీ నిర్ణయాలకు అనుగుణంగా కార్మికుల పిల్లలకు సింగరేణి విద్యాసంస్థల్లో పదో తరగతి వరకు రూపాయి ఖర్చు లేకుండా ఉచిత విద్యను అందించనున్నారు. ఈ నిర్ణయం వల్ల సంస్థలోని 12 ఏరియాల్లో పనిచేస్తున్న దాదాపు 30 వేల మంది కార్మిక కుటుంబాలకు ప్రయోజనం కలగనుండగా, సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ నిర్వహిస్తున్న 9 పాఠశాలల్లో ప్రస్తుతం చదువుతున్న 400 మందికి పైగా విద్యార్థులకు ఈ సదుపాయం తక్షణమే వర్తిస్తుంది.
ఈ ఉచిత విద్యా పథకాన్ని అమలు చేయాలని కోరుతూ సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ జనరల్ మేనేజర్ అన్ని ఏరియాలకు అధికారిక ఆదేశాలు జారీ చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్తగా అడ్మిషన్లు తీసుకునే విద్యార్థులకు కూడా ఉచిత ప్రవేశాలు, ఉచిత విద్య వర్తిస్తుండటంతో సింగరేణి స్కూళ్లలో చేరే వారి సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకునే కార్మికులు తమ గుర్తింపు కార్డు (ID Card), ఆధార్ కార్డు, రేషన్ కార్డు, విద్యార్థి ఆధార్ కార్డుతో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ను సంబంధిత సింగరేణి శాఖాధిపతుల (HOD) ద్వారా ధ్రువీకరించి పాఠశాలల్లో సమర్పించాల్సి ఉంటుంది.
బయట ప్రైవేటు స్కూళ్లలో వేలకు వేలు ఫీజులు చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కార్మిక కుటుంబాలకు సింగరేణి యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయం పెద్ద ఊరటనిస్తోంది. ఇప్పటికే కాంట్రాక్టు కార్మికులకు రూ. 5,500 చొప్పున లాభాల వాటా బోనస్ అందించి అండగా నిలిచిన సంస్థ, ఇప్పుడు వారి పిల్లల చదువు భారాన్ని తొలగించి భవిష్యత్తుకు భరోసా కల్పించడంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. తమకు అండగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వానికి, సింగరేణి యాజమాన్యానికి కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
