గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన కుమార్తె మాల్తీ మేరీ సాహసాన్ని చూసి మురిసిపోయారు. ప్రస్తుతం తన హాలీవుడ్ చిత్రం ‘ది బ్లఫ్’ షూటింగ్ నిమిత్తం ఆస్ట్రేలియాలో ఉన్న ప్రియాంక, చిత్రీకరణ విరామంలో తల్లి మధు చోప్రా, కుమార్తె మాల్తీతో కలిసి స్థానిక జూను సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా జూ సిబ్బంది పర్యవేక్షణలో ఒక భారీ అనకొండను మాల్తీ ఏమాత్రం బెరుకు లేకుండా తాకి నిమరడం అందరినీ అబ్బురపరిచింది.
తన కుమార్తె ‘అత్యంత ధైర్యవంతురాలు’ అంటూ కూతురి తెగువను చూసి గర్వంగా ఉందని ప్రియాంక సోషల్ మీడియా వేదికగా ఫొటోలు, వీడియోలను పంచుకున్నారు. అనకొండతోనే కాకుండా కంగారూలు, జిరాఫీలు వంటి ఇతర జంతువులతోనూ మాల్తీ ఎంతో ఉత్సాహంగా సందడి చేయగా, ప్రస్తుతం ఈ దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి.
ఈ పర్యటనకు సహకరించిన హాలీవుడ్ నటుడు రస్సెల్ క్రోకు, సాదరంగా ఆహ్వానించిన ఇర్విన్ కుటుంబానికి ప్రియాంక ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా దివంగత వన్యప్రాణి సంరక్షకుడు స్టీవ్ ఇర్విన్ను స్మరించుకున్న ఆమె, ఆ జూలో అడుగడుగునా జంతువుల పట్ల ఆయనకు ఉన్న అపారమైన ప్రేమ, అంకితభావం కనిపిస్తున్నాయని, ఈ మధుర స్మృతులను తాను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని భావోద్వేగంగా పేర్కొన్నారు.
