Latest Posts

గాంధీ భవన్‌తో నాకు ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఉంది.. ఒక్క రోజు కూడా విరామం లేకుండా పనిచేస్తున్నా: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి!

హైదరాబాద్‌లోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్‌తో తనకు ఎంతో సెంటిమెంటల్, ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఉందని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నూతన ఇన్‌ఛార్జ్ బీఎం సందీప్‌తో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యి పార్టీ అంతర్గత వ్యవహారాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో తాను ఏడేళ్ల పాటు పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన విషయాన్ని ఉత్తమ్ గుర్తు చేసుకున్నారు.

ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి నిబద్ధతతో పనిచేస్తున్నామని స్పష్టం చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, తన శాఖలో ఒక్క రోజు, ఒక్క గంట కూడా విరామం లేకుండా పనిచేస్తున్నానని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ.. వారి హయాంలో మాటలు ఎక్కువ, పని తక్కువగా ఉండేదని, నాటి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ బోగస్ అని కొట్టిపారేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటల కంటే చేతలకే ప్రాధాన్యం ఇస్తూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని చెప్పారు.

ఇదే క్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, పార్టీ వ్యవహారాలు మరియు ప్రభుత్వ పనితీరుపై నూతన ఇన్‌ఛార్జ్ బీఎం సందీప్‌తో సుదీర్ఘంగా చర్చించామని వెల్లడించారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని అధిష్ఠానం దిశానిర్దేశం చేసిందని ఆయన పేర్కొన్నారు.

Editor