Latest Posts

జబర్దస్త్ కమెడియన్లు దొరబాబు, రైజింగ్ రాజు కారుకు ఘోర రోడ్డు ప్రమాదం.. భీమవరం ఆసుపత్రిలో చికిత్స!

ప్రముఖ కామెడీ షో ‘జబర్దస్త్’ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన కమెడియన్లు దొరబాబు, రైజింగ్ రాజు ప్రయాణిస్తున్న కారు ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదానికి గురైంది. కాకినాడలో ఓ కార్యక్రమాన్ని ముగించుకుని తిరిగి వస్తుండగా పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం గోరగనమూడి సమీపంలో కారు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి కారులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. ఈ ఘటనలో కమెడియన్లు దొరబాబు, రైజింగ్ రాజుతో పాటు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. స్థానికులు వారిని హుటాహుటిన భీమవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్‌కు తీవ్ర గాయాలైనట్లు సమాచారం.

సమాచారం అందుకున్న పాలకోడేరు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. అతివేగం లేదా నిద్రమత్తు వల్ల కారు అదుపుతప్పిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాద వార్త తెలిసి జబర్దస్త్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ, దొరబాబు, రైజింగ్ రాజు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

Editor