హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ఉదయం, సాయంత్రం వేళల్లో గంటల తరబడి సాగే ట్రాఫిక్ జామ్‌లు, నిరంతర హారన్ల మోతతో నరకం చూస్తున్న ఉద్యోగులు, ప్రయాణికులకు ఊరటనిచ్చేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక ముందడుగు వేశారు. హైటెక్ సిటీ, బయోడైవర్సిటీ, నాలెడ్జ్ సిటీ జంక్షన్లలో నిత్యం ఏర్పడే ట్రాఫిక్ స్తంభనను శాశ్వతంగా అరికట్టేందుకు ‘వన్ వే లూప్’ (One-Way Loop) విధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ మరియు సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (SCSC) సంయుక్తంగా ఈ ప్రాజెక్టును రూపొందిస్తుండగా, రోడ్ల విస్తీర్ణాన్ని పూర్తిస్థాయిలో వాడుకుంటూ సిగ్నళ్లు మరియు కూడళ్ల వద్ద వాహనాలు ఆగాల్సిన అవసరం లేకుండా నిరంతరాయంగా ముందుకు సాగేలా చేయడం దీని ప్రధాన లక్ష్యం.
ప్రతిపాదిత ‘వన్ వే లూప్’ ప్రణాళిక ప్రకారం వాహనాలు ఒకే దిశలో ప్రయాణించేలా ప్రత్యేక రూట్ మ్యాప్‌ను సిద్ధం చేశారు. ఈ లూప్ బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద ప్రారంభమై.. ఐకియా రోటరీ, రహేజా మైండ్‌స్పేస్ సి-గేట్, నాలెడ్జ్ సిటీ మరియు డల్లాస్ సెంటర్ మీదుగా సాగుతుంది; చివరగా మై హోమ్ భూజా వద్ద కుడివైపు మలుపు తీసుకుని తిరిగి బయోడైవర్సిటీ జంక్షన్‌కు చేరుకునేలా ప్లాన్ చేశారు. వాహనాలు ఎక్కడా నిలవకుండా ఒకే ప్రవాహంలో సులువుగా కదిలేలా చేయడం వల్ల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడమే కాకుండా, ప్రధాన జంక్షన్లపై ఒత్తిడి తప్పుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఈ మాస్టర్ ప్లాన్ ఆచరణ సాధ్యతను పరిశీలించేందుకు సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్, ట్రాఫిక్ జాయింట్ సీపీ సున్‌ప్రీత్ సింగ్, ఎస్సీఎస్సీ సీఈఓ నవీద్ ఖాన్‌లతో కూడిన ఉన్నతాధికారుల బృందం క్షేత్రస్థాయిలో రద్దీ ప్రాంతాలను సందర్శించి సమగ్ర సమీక్ష నిర్వహించింది. త్వరలోనే రద్దీ వేళల్లో వాహనాల వేగం, సాంద్రతను అంచనా వేసేందుకు ప్రత్యేక ‘ట్రాఫిక్ సిమ్యులేషన్ పరీక్షలు’ నిర్వహించనున్నారు. ఐటీ కంపెనీల ప్రతినిధులు, వ్యాపార వర్గాలు, స్థానిక ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించి తుది ప్రణాళిక సిద్ధం చేసిన తర్వాత, ముందస్తు ట్రాఫిక్ అడ్వైజరీలు విడుదల చేస్తూ ఈ ‘వన్ వే లూప్’ను దశలవారీగా అమలు చేస్తామని కమిషనర్ స్పష్టం చేశారు.
