దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ, ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో బాణసంచా విక్రయాలు, వినియోగంపై కొనసాగుతున్న ఆంక్షలపై సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. టపాసులపై ఆంక్షలను కొనసాగించాలా లేక సడలించాలా అనే అంశంపై జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ ప్రసన్న బి. వరాఠేలతో కూడిన ధర్మాసనం తన తీర్పును రిజర్వ్ చేసింది. అయితే కేవలం కాగితాలపై సంపూర్ణ నిషేధం విధించడం కంటే, నిబంధనలను క్షేత్రస్థాయిలో కఠినంగా అమలు చేయడమే అత్యంత కీలకమని కోర్టు స్పష్టం చేసింది. వాయు కాలుష్యంపై ప్రజల్లో, ప్రత్యేకించి యువతలో చైతన్యం పెంచేందుకు క్రికెటర్ విరాట్ కోహ్లీ వంటి ప్రముఖులతో విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని న్యాయస్థానం సూచించింది.
ఈ సందర్భంగా ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. కాలుష్య నియంత్రణపై తాము ఏటా ఇచ్చే ఆదేశాలు క్షేత్రస్థాయిలో సరిగ్గా అమలు కాకపోవడంతో కేవలం ‘అకడమిక్’ ప్రక్రియగానే మిగిలిపోతున్నాయని వ్యాఖ్యానించింది. విచారణలో భాగంగా పిటిషనర్ల తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. టపాసుల వల్ల వెలువడే ప్రమాదకరమైన పీఎం2.5 రేణువులు, విషవాయువులు రక్తంలో కలిసి ప్రాణాంతక సమస్యలకు దారితీస్తున్నాయని, ముఖ్యంగా పిల్లలు, పొగతాగని వారి ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయని తెలిపారు. మార్కెట్లో ‘గ్రీన్ క్రాకర్స్’ పేరుతో నకిలీవి అమ్ముతున్నారని, అసలైన గ్రీన్ క్రాకర్స్ కూడా సాధారణ టపాసుల కంటే 30 శాతం కాలుష్యాన్ని మాత్రమే తగ్గిస్తాయి తప్ప పూర్తిగా సురక్షితం కావని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
మరోవైపు టపాసుల తయారీదారులు సంపూర్ణ నిషేధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. నిషేధం వల్ల బ్లాక్ మార్కెట్ విపరీతంగా పెరిగిపోయి మరింత ప్రమాదకరమైన టపాసులు అక్రమంగా చెలామణిలోకి వస్తాయని వాదించారు. ఇక ఢిల్లీ ప్రభుత్వం, వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ (సీఏక్యూఎం) చేపట్టిన యాంటీ-స్మాగ్ గన్లు, ఇతర చర్యలను పరిశీలించిన కోర్టు.. పర్యవేక్షణ కేంద్రాల కొరత, సరైన డేటా లేకపోవడంపై అధికారులను నిలదీసింది. అమలు చేయలేని ఆదేశాలు ఇవ్వడం నిరర్థకమని స్పష్టం చేస్తూనే, పూర్తి నిషేధానికి బదులుగా అనుమతించిన సమయంలో కఠిన నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలనే సంకేతాలను సుప్రీంకోర్టు ఇచ్చింది.
