80 మంది విద్యార్థులకు అరగుండు.. మహారాష్ట్ర ఆశ్రమ పాఠశాలలో కలకలం

మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా కేంద్రంలో ఓ ఆశ్రమ పాఠశాలలో సుమారు 80 మంది విద్యార్థులకు అరగుండు చేయించిన ఘటన కలకలం రేపింది. విద్యార్థులకు జుట్టు కత్తిరించేందుకు పాఠశాల సిబ్బంది బార్బర్‌ను పిలిపించారు. అయితే కటింగ్ సమయంలో కొంతమంది విద్యార్థులు అందుబాటులో లేకపోవడంతో ప్రిన్సిపాల్ ఆగ్రహించినట్లు తెలుస్తోంది.

కటింగ్ చేయించుకోని సుమారు 80 మంది విద్యార్థులకు అరగుండు చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు.

ఈ ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు ప్రిన్సిపాల్‌తో పాటు పాఠశాల సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. విచారణ అనంతరం వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Editor