Latest Posts

“ప్రార్థన చేసుకుంటానని చెప్పి.. భారత పైలట్‌పై దాడి!”: ఫ్లైదుబాయ్ కాక్‌పిట్ ఘటనలో సంచలన నిజాలు.. కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యసాహసాలతో తప్పిన విమాన ప్రమాదం!

దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో సెప్టెంబర్ 30న కాక్‌పిట్‌ వేదికగా చోటుచేసుకున్న భయానక దాడి ఘటనకు సంబంధించిన నమ్మశక్యం కాని వివరాలు వెలుగులోకి వచ్చాయి. విమానాన్ని నడుపుతున్న భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై ఒమన్‌కు చెందిన కో-పైలట్ హమామ్ అల్-హమ్మామీ ప్రార్థన ముసుగులో విచక్షణారహితంగా దాడి చేశాడు. ప్రార్థన చేసుకుంటానని చెప్పడంతో గౌరవపూర్వకంగా తాను ముందువైపు దృష్టి సారించానని, కొద్దిసేపటికే తల వెనుక భాగంలో బలమైన దెబ్బ తగలడంతో మొదట ఏదైనా సాంకేతిక లోపమని భావించానని.. అయితే పక్కనే ఉన్న కో-పైలట్ తనపై వరుసగా దాడి చేస్తుండటంతో కుట్రను గ్రహించానని కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడుతూ వెల్లడించారు.

దాడి తీవ్రతకు తలకు బలమైన గాయమై కంటిచూపు మసకబారినప్పటికీ.. కెప్టెన్ స్మిత్ మచ్చర్ అసాధారణ సమయస్ఫూర్తిని ప్రదర్శించారు. విమానం నియంత్రణ కోల్పోయి వేగంగా కిందికి దిగుతుండటం, వెనుక క్యాబిన్ నుంచి ప్రయాణికుల ఆర్తనాదాలు వినపడటంతో పరిస్థితి విషమించిందని గుర్తించారు. ప్రాణాపాయ స్థితిలోనూ సర్వశక్తులు ఒడ్డి కాక్‌పిట్ తలుపును తెరిచేందుకు ప్రయత్నించగా, మొదటిసారి కో-పైలట్ దాన్ని బలవంతంగా మూసివేశాడు. “ఇప్పుడు పోరాడకపోతే అందరం ప్రాణాలు కోల్పోతాం” అని భావించిన కెప్టెన్.. చివరి రక్తపుబొట్టు వరకు పోరాడి రెండోసారి కాక్‌పిట్ డోర్‌ను తెరవడంలో విజయం సాధించారు.

డోర్ తెరుచుకోవడంతో విమాన సిబ్బంది, కొందరు ప్రయాణికులు వెంటనే కాక్‌పిట్‌లోకి చొరబడి వికృత చేష్టలకు పాల్పడుతున్న కో-పైలట్‌ను చాకచక్యంగా బంధించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయంలో సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో వందలాది మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనను యూఏఈ అధికార యంత్రాంగం ఉగ్రవాద చర్యగా అభివర్ణించగా, ప్రస్తుతం గాయపడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ యూఏఈలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విమానాన్ని కూల్చివేసే ఉద్దేశంతోనే కో-పైలట్ ఈ దాడికి ఒడిగట్టాడా అన్న కోణంలో అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలు విచారణను ముమ్మరం చేశాయి.

Editor