అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నిర్వహించిన ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్’ ప్రారంభోత్సవ సభలో చోటుచేసుకున్న పరిణామాలపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ చేసిన పోస్టుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వాస్తవాలను నిర్ధారించుకోకుండా, సోషల్ మీడియాలోని తప్పుడు సమాచారం ఆధారంగా సీనియర్ నాయకులు వ్యాఖ్యానించడం గర్హనీయమని మండిపడ్డారు. అక్కడ కనిపించింది కూటమి నాయకుల పట్ల ప్రజలు చూపిన అపూర్వమైన ఉత్సాహమే తప్ప ప్రజాగ్రహం ఏమాత్రం కాదని స్పష్టం చేస్తూ జైరాం రమేశ్‌కు ఘాటుగా బదులిచ్చారు.
ఈ వివాదం నేపథ్యాన్ని పరిశీలిస్తే.. సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగిస్తుండగా, వేదికపై ఉన్న తమ అభిమాన నాయకులను చూసేందుకు కొందరు యువకులు ఉత్సాహంతో పెద్ద ఎత్తున కేకలు వేశారు. ఆ సమయంలో సభ సజావుగా సాగేందుకు సీఎం చంద్రబాబు మైక్ తీసుకుని జోక్యం చేసుకుంటూ యువతను శాంతింపజేశారు. అయితే, సులేమాన్ ఖాన్ అనే నెటిజన్ ఈ వీడియోను షేర్ చేస్తూ.. ‘ముందుగా ఉద్యోగాలు ఇవ్వండి’ అంటూ యువత నినాదాలు చేసిందని తప్పుడు వ్యాఖ్యానం జోడించగా, దాన్ని జైరాం రమేశ్ రీపోస్ట్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాగ్రహం వ్యక్తమైందంటూ పోస్ట్ చేయడం తీవ్ర దుమారానికి దారితీసింది.
జైరాం రమేశ్ చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. “జరిగిన ఘటనకు మీ విశ్లేషణకు పొంతన లేదు; ప్రజల ఉత్సాహాన్ని ఆగ్రహంగా భ్రమపడుతున్నారంటే మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల నాడికి ఎంత దూరంగా ఉన్నారో అర్థమవుతోంది” అని ఎద్దేవా చేశారు. మరోవైపు మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ.. సీనియర్ కాంగ్రెస్ నేతలు ఉద్దేశపూర్వకంగా కత్తిరించిన వీడియోలతో ఫేక్ న్యూస్‌ను వ్యాప్తి చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రితో జరిగిన సాధారణ సంభాషణను వక్రీకరించి అవాస్తవాలను ప్రచారం చేయడం సరికాదని, తక్షణమే ఆ తప్పుడు ట్వీట్‌ను తొలగించాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
