ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరియు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) వర్గాల మధ్య విభేదాలు మరోసారి తీవ్రస్థాయికి చేరాయి. ఇటీవల ఎమ్మెల్యే కొలికపూడి ఒక పాఠశాల ఉపాధ్యాయుడిపై చేయి చేసుకున్నారంటూ సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ప్రచారంపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎంపీ కేశినేని చిన్ని డైరెక్షన్‌లోనే తనపై పార్టీలోని కొందరు నాయకులు కుట్రపూరితంగా అసత్య ఆరోపణలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ బురదజల్లే ప్రయత్నం చేస్తే తాటతీసి తోలుతీస్తానంటూ సొంత పార్టీకి చెందిన ప్రత్యర్థి వర్గానికి బహిరంగంగా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డు ఛైర్మన్ పోతుల బాలకోటయ్య తనపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేస్తూ రాసిన లేఖ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంపై కొలికపూడి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను నిజంగా ఉపాధ్యాయుడిని కొట్టినట్లు గానీ, దూషించినట్లు గానీ ఆధారాలు ఉంటే బహిరంగంగా ప్రజల ముందు ఉంచాలని సవాల్ విసిరారు. ఒకవేళ ఆ ఆరోపణలు నిజమని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తలదించుకుని వెళ్లిపోతానని, నిరూపించలేకపోతే తప్పుడు ప్రచారం చేసినందుకు బాలకోటయ్య బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
విజయవాడ ఎంపీ అండతో బాలకోటయ్య గత రెండేళ్లుగా తిరువూరు నియోజకవర్గ అంతర్గత రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ లేనిపోని అసత్యాలను ప్రచారం చేస్తున్నారని కొలికపూడి ధ్వజమెత్తారు. దీనిపై నిలదీసేందుకు తిరువూరు నుంచి వంద మంది పార్టీ కార్యకర్తలు విజయవాడలోని బాలకోటయ్య కార్యాలయానికి వెళ్తున్నారని, ఆధారాలు ఉంటే చూపించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఇకపై సోషల్ మీడియాలో తన ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోనని, ఆరోపణలు చేసిన వారి ఇంటి ముందే నిలబడి తాటతీసి చెప్పులు కుడతానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో విజయవాడ పార్లమెంట్ పరిధిలోని టీడీపీ రాజకీయాల్లో ఈ అంశం తీవ్ర కలకలం రేపింది.
