భూములు, ఆస్తుల తగాదాలు వంటి సివిల్ వ్యవహారాల్లో పోలీసుల ప్రమేయం తగదంటూ హైకోర్టు మరోసారి అత్యంత ఘాటుగా స్పష్టం చేసింది. స్థలాలు, ఆస్తి హక్కుల వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకుంటూ స్టేషన్లకు పిలిపించి వేధిస్తున్నారంటూ పెద్ద సంఖ్యలో దాఖలైన పిటిషన్లను న్యాయస్థానం క్షుణ్ణంగా విచారించింది. సివిల్ కోర్టులు, ప్రత్యేక ఫోరమ్‌ల పరిధిలో ఉన్న వివాదాలను సెటిల్మెంట్ చేసే హక్కుగానీ, అధికారం గానీ పోలీసు వ్యవస్థకు ఏమాత్రం లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. అలాంటి చర్యలు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేస్తూ, ఇప్పటికైనా ఇలాంటి జోక్యాలకు తక్షణమే స్వస్తి పలకాలని ఆదేశించింది.
శాంతిభద్రతల పరిరక్షణ కోసం జిల్లా స్థాయి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్లకు ఆదేశాలు ఇచ్చే అధికారం ఉన్నప్పటికీ, ఏదైనా వివాదం సివిల్ కోర్టు లేదా చట్టబద్ధమైన ఫోరమ్‌కు చేరినప్పుడు ఆ అధికారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేయరాదని న్యాయస్థానం గుర్తుచేసింది. ఈ తరహా అంశాల్లో పోలీసు యంత్రాంగం ఎలా నడుచుకోవాలో గత అక్టోబర్ 24న రాష్ట్ర డీజీపీ స్వయంగా జారీ చేసిన మార్గదర్శకాలను ప్రతి పోలీస్ స్టేషన్లో కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది. అయితే, వివాదాల సమయంలో పిటిషనర్లు ఎవరైనా ప్రత్యక్ష కాగ్నిజబుల్ నేరాలకు పాల్పడితే మాత్రం చట్టప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారించే పూర్తి స్వేచ్ఛ పోలీసులకు ఉంటుందని స్పష్టం చేసింది.
నేర నియంత్రణ, పౌరుల ప్రాణ, ఆస్తుల రక్షణ మాత్రమే పోలీసుల ప్రాథమిక విధి అని, అంతే తప్ప సివిల్ పంచాయితీల్లో తలదూర్చి ఆస్తులు ఖాళీ చేయించడం లేదా రికవరీలు జరపడం వారి పరిధి కాదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కుంచం మహేశ్వరరావు తన తీర్పులో స్పష్టం చేశారు. పరిమిత సంఖ్యలో ఉన్న పోలీస్ సిబ్బంది ప్రజా సమస్యల పరిష్కారాన్ని విస్మరించి, సివిల్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం వల్ల కొంతమంది అధికారులు అక్రమంగా లబ్ధి పొందడం తప్ప ప్రజలకు ఒరిగేదేమీ ఉండదని ఆక్షేపించారు. పోలీస్ శాఖ ఇప్పటికైనా ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాలని మార్గదర్శనం చేశారు.
