ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తన కుమార్తె షరణి రాజకీయ రంగప్రవేశంపై వస్తున్న ప్రచారానికి పూర్తిగా తెరదించారు. తన కుటుంబం నుంచి ఎవరూ కూడా క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నెల్లూరు మేయర్ అభ్యర్థిగా తన కుమార్తె పోటీ చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో, స్థానికంగా సాగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, అవన్నీ నిరాధారమైన వదంతులని కొట్టిపారేశారు.
తనపై కొందరు చేస్తున్న విమర్శలను తాను ఏనాడూ పట్టించుకోబోనని స్పష్టం చేసిన మంత్రి నారాయణ.. “కామెర్ల రోగికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది” అంటూ రాజకీయ ప్రత్యర్థులపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాను కేవలం ప్రజాసేవ చేయాలనే బలమైన సంకల్పంతోనే రాజకీయాల్లోకి వచ్చానని, ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు ఆశించకుండా ప్రజల శ్రేయస్సు కోసమే నిరంతరం పనిచేస్తానని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల సమగ్ర వికాసానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, గత రెండేళ్లలో 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి భారీ ఎత్తున నిధులు వెచ్చించామని వివరించారు. పేదలకు శాశ్వత నివాస హక్కులు కల్పించడంలో భాగంగా విశాఖపట్నం, విజయవాడల్లో వేలాది మందికి ఇళ్ల పట్టాలు అందించినట్లే.. నెల్లూరు నగరంలో ఇప్పటికే 1,450 మందికి అందజేశామని, త్వరలోనే మరో 1,250 మందికి శాశ్వత ధ్రువీకరణ పత్రాలు అందజేసి పేదల సొంతింటి కలను నిజం చేస్తామని మంత్రి వెల్లడించారు.
