రూ.46 కోట్లతో ఆగిపోయిన రైల్వే బ్రిడ్జి పనులకు పునఃప్రారంభం

అనంతపురం జిల్లా..

రాయదుర్గం నియోజకవర్గం..

7 ఏళ్లుగా ఆగిపోయిన రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులకు మళ్లీ కదలిక వచ్చింది. రూ.46 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన రైల్వే బ్రిడ్జి పనులను రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పునఃప్రారంభించారు.
రాయదుర్గం పట్టణంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ సమీపంలో నిలిచిపోయిన రైల్వే బ్రిడ్జి పనులను ఎమ్మెల్యే పరిశీలించి పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో రెండు రైల్వే బ్రిడ్జిల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు.
అయితే ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ పాలనలో ఈ బ్రిడ్జిల నిర్మాణ పనులను పట్టించుకోకపోవడంతో అభివృద్ధి నిలిచిపోయిందని ఎమ్మెల్యే విమర్శించారు. ఏళ్ల తరబడి పనులు నిలిచిపోవడంతో వంతెనలు శిథిలావస్థకు చేరి, ప్రజలకు ఇబ్బందులు కలిగించాయని అన్నారు.
ఈ రహదారి నిర్మాణం సుమారు 3.531 కిలోమీటర్ల మేర కొనసాగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ద్వారకామాయి కన్‌స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు.
రాయదుర్గం అభివృద్ధిపై పట్టువదలకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని పలుమార్లు కలిసి, ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రైల్వే బ్రిడ్జి పనులను తిరిగి ప్రారంభించాలని విజ్ఞప్తి చేశామని కాలవ శ్రీనివాసులు తెలిపారు.
ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో.. రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని చెప్పారు. నేషనల్ అథారిటీ అధికారులతో పలుమార్లు చర్చలు జరిపిన అనంతరం పనులకు మళ్లీ అనుమతులు, నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు.
ఆగిపోయిన అభివృద్ధి పనులను తిరిగి ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని కాలవ శ్రీనివాసులు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీస్సులు, మంత్రుల సహకారంతో రాయదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు.
అభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రాయదుర్గం ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని ఎమ్మెల్యే అన్నారు.
2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో రాయదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధికి పెద్దపీట వేసి చరిత్ర సృష్టించామని, ఇప్పుడు ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభిస్తూ అభివృద్ధి చరిత్రను కొనసాగిస్తున్నామని కాలవ శ్రీనివాసులు తెలిపారు.
రాయదుర్గం అభివృద్ధి కోసం టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ఆగిపోయిన ప్రతి అభివృద్ధి పనిని తిరిగి ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు.

బైట్స్ : కాలవ శ్రీనివాసులు, రాయదుర్గం శాసనసభ్యులు.

Posted Under AP
Editor