కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో కలకలం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. అధికార పార్టీ నేత ముఖ్య అనుచరుడి వేధింపులు భరించలేక అంగన్వాడీ టీచర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు
కర్నూలు జిల్లా ఆలూరు మండలం పెద్దహోత్తూరు గ్రామంలోని రెండో నంబర్ అంగన్వాడీ కేంద్రంలో టీచర్ గా పనిచేస్తున్న లేపాక్షమ్మ అనే మహిళపై తీవ్ర మానసిక వేధింపులు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
స్థానికుల కథనం ప్రకారం, ఆలూరు టీడీపీ ఇంచార్జి వైకుంఠం జ్యోతి ముఖ్య అనుచరుడిగా చెప్పబడుతున్న వీరేష్ ప్రతిరోజూ అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి అక్కడి సిబ్బందిని ఇబ్బందులకు గురిచేసేవాడని చెబుతున్నారు.
ఈ క్రమంలో లేపాక్షమ్మ తొ అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ అవమానాలు, నిరంతర మానసిక వేధింపులను తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన లేపాక్షమ్మ క్రిమిసంహారక మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం.
విషయం గమనించిన స్థానిక పాఠశాల సిబ్బంది వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో, వారు ఆమెను అత్యవసరంగా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతుండగా, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్య వర్గాలు తెలిపినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, బాధితురాలి సోదరుడు భాస్కర్ మాట్లాడుతూ, అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నాయనే ధైర్యంతో వీరేష్ తమ కుటుంబంపై, ముఖ్యంగా లేపాక్షమ్మ పై దౌర్జన్యానికి పాల్పడ్డాడని ఆరోపించారు.
ఈ ఘటనపై ఇప్పటికే ఆలూరు పోలీస్ స్టేషన్లో రాతపూర్వక ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. రాజకీయ పలుకుబడితో నిందితుడు తప్పించుకోకుండా పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులతో పాటు పెద్దహోత్తూరు గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
అయితే, ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేశారు? ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరేష్ లేదా సంబంధిత రాజకీయ నాయకుల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? అనే అంశాలపై అధికారిక సమాచారం ఇంకా వెలువడాల్సి ఉంది. ఈ కేసుకు సంబంధించిన తాజా వివరాలు అందిన వెంటనే మీకు అందిస్తాం.
