అనంతపురం జిల్లా రాయదుర్గం
*రాయదుర్గంలో తాగునీటి కష్టాలు… ఖాళీ బిందెలతో 28వ వార్డు ప్రజల రోడ్డుపై ధర్నా, ట్రాఫిక్ జామ్*
రాయదుర్గం పట్టణంలో తాగునీటి సమస్యపై స్థానిక ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు అధికారులతో మూడు సార్లు సమీక్షా సమావేశాలు జరిపి అధికారులకు హెచ్చరికలు జారీ చేసినా, పట్టణంలో తాగునీటి సమస్య తీరడం లేదు. సమస్య తీరకపోగా మరింత జటిలంగా మారింది. కణేకల్లు దగ్గర ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లో రెండు నెలలకు సరిపడా నీరు ఉన్నప్పటికీ, పట్టణంలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు తాగునీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఎక్కడికక్కడ ఖాళీ బిందెలతో రోడ్డెక్కి మహిళలు ధర్నా చేయడం నిత్యకృత్యంగా మారింది. గత నెల రోజులుగా తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తాజాగా 28వ వార్డుకు చెందిన ప్రజలు బళ్లారి ప్రధాన రోడ్డుపై ఖాళీ బిందెలతో బైఠాయించారు. వారి నిరసనతో సుమారు గంటపాటు ట్రాఫిక్ స్తంభించింది. తమ ప్రాంతానికి తక్షణమే తాగునీరు సరఫరా చేసేదాకా ఇక్కడి నుంచి కదిలేది లేదని వారు స్పష్టం చేశారు. వారి నిరసనకు కాంగ్రెస్, సీపీఐ నాయకులు సంఘీభావం తెలిపారు. తక్షణమే మున్సిపల్ కమిషనర్ ఇక్కడికి రావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే, ముఖ్యమైన అధికారులు ఎవరూ అక్కడికి వచ్చి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వలేదు. చివరకు కిందిస్థాయి సిబ్బంది స్థానిక టీడీపీ నాయకులు వచ్చి సముదాయించే ప్రయత్నం చేయగా, ప్రజలు వారిని చుట్టుముట్టి నిలదీశారు. “నెల రోజులుగా సమస్య ఉంటే మీ నాయకులు ఎక్కడ ఉన్నారు?” అని ప్రశ్నించి, అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని ప్రజలకు నచ్చజెప్పే ఆందోళన విరమింప జేశారు. అయితే పట్టణంలో తాగునీటి సరఫరాపై పై మున్సిపల్ యంత్రాంగం తక్షణమే స్పందించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం అయ్యే అవకాశం కనిపిస్తోంది.
