రోడ్డుకు ఇరువైపులా పెరిగిన కంపచెట్లు తొలగించాలని ప్రజల డిమాండ్…

తాడిమర్రి( yes9tv )రోడ్డుకు ఇరువైపులా పెరిగిన కంపచెట్లు తొలగించాలని ప్రజల డిమాండ్
అధికారుల నిర్లక్ష్యంతో ప్రాణాపాయ ఘటనలు పునరావృతం
చిలకొండయ్యపల్లి మలుపులో ఘోర ప్రమాదం.. మహిళకు తీవ్ర గాయాలు
తాడిమర్రి మండలంలోని చిలకొండయ్యపల్లి గ్రామ సమీపంలో ధర్మవరం–పులివెందుల ప్రధాన రహదారిపై శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల మేరకు పులివెందుల ప్రాంతానికి చెందిన భార్యాభర్తలు ద్విచక్ర వాహనంపై ధర్మవరం వైపు ప్రయాణిస్తుండగా, చిలకొండయ్యపల్లి వద్ద ఉన్న ప్రమాదకర మలుపు సమీపంలో ఈ ఘటన జరిగింది.
రోడ్డుకు ఇరువైపులా కంపచెట్లు, పొదలు విపరీతంగా పెరిగి ఉండటంతో ఎదురుగా వస్తున్న వాహనాలు స్పష్టంగా కనిపించని పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో ఎదురుగా వేగంగా వస్తున్న స్కార్పియో వాహనాన్ని గమనించిన ద్విచక్ర వాహనదారుడు ప్రమాదాన్ని తప్పించేందుకు వాహనాన్ని రోడ్డు పక్కకు దించాడు. ఈ క్రమంలో వెనుక కూర్చున్న మహిళ అదుపుతప్పి కిందపడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదాన్ని గమనించిన స్థానిక గ్రామస్తులు వెంటనే స్పందించి అంబులెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు. ఆలస్యం కాకుండా ఆటో సహాయంతో బాధితురాలిని అంబులెన్స్ వద్దకు తరలించి, అనంతరం చికిత్స నిమిత్తం ఆర్డీటీ ఆసుపత్రికి పంపించారు.
ఈ సందర్భంగా బాధితులు మరియు స్థానిక ప్రజలు మాట్లాడుతూ, చిలకొండయ్యపల్లి మలుపు వద్ద రోడ్డుకు ఇరువైపులా పెరిగిన కంపచెట్లు, పొదల కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదని, దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇదే ప్రాంతంలో పలుమార్లు ప్రమాదాలు జరిగినప్పటికీ సంబంధిత అధికారులు స్పందించలేదని ఆరోపించారు.
ప్రధాన రహదారిపై ఉన్న మలుపుల వద్ద వెంటనే కంపచెట్లు, పొదలను తొలగించి రహదారిని విస్తరించాలని, హెచ్చరిక బోర్డులు, స్పీడ్ లిమిట్ సూచికలు ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరొక ప్రాణనష్టం జరగకముందే రోడ్లు-భవనాల శాఖ, అటవీ శాఖ, స్థానిక అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు ప్రమాదకర మలుపుల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Posted Under AP
Editor