కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్లపై టీజీపీఎస్సీ కీలక ప్రకటన..

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఉద్యోగార్థులకు శుభవార్త చెప్పింది. మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని టీజీపీఎస్సీ ప్రకటించింది. మార్చి 31లోగా ఉద్యోగ ఖాళీల వివరాలను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు వెల్లడించింది. ఖాళీల మేరకు నోటిఫికేషన్లు జారీపై ఏప్రిల్ నెలలో కసరత్తు చేస్తామని పేర్కొంది.

 

కొత్త నోటిఫికేషన్లు ఇచ్చి 6-8 నెలల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని టీజీపీఎస్సీ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారమే ఫలితాలు వచ్చేలా పనిచేస్తున్నామని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. అభ్యర్థులెవరూ ఆందోళన చెందవద్దని ఆయన భరోసా ఇచ్చారు.

నిరుద్యోగులకు టీజీపీఎస్సీపై నమ్మకం కలిగేలా పనిచేస్తున్నామని బుర్రా వెంకటేశం చెప్పారు. ఫలితాల ఆలస్యానికి ఆస్కారమే లేదన్నారు.

 

వీటితో పాటు ఈవో పరీక్షా ఫలితాలు కూడా ఇవ్వబోతున్నామని ఆయన ప్రకటించారు. మరోవైపు, జనవరి 11, 12 తేదీల్లో బెంగళూరులో పబ్లిక్ సర్వీస్ కమిషన్ల సదస్సు ఉంటుందని, ఉద్యోగ పరీక్షల విధానాలపై సదస్సులో చర్చించనున్నట్లు ఛైర్మన్ వెంకటేశం తెలిపారు.

 

గ్రూప్ 3 కీ విడుదల

 

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుధవారం గ్రూప్-3 పరీక్ష ప్రాథమిక కీని విడుదల చేసింది. అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లలో ప్రాథమిక కీ అందుబాటులో ఉంటుందని తెలిపింది. జనవరి 12 వరకు గ్రూప్ 3 ప్రాథమిక కీ అందుబాటులో ఉండనున్నట్లు టీజీపీఎస్సీ పేర్కొంది. ఏవైనా సందేహాలు ఉంటే జనవరి 12న సాయంత్రం 5 వరకు స్వీకరిస్తామని తెలిపింది. అభ్యంతరాలను ఇంగ్లీష్‌లో తెలపాలని టీజీపీఎస్సీ వెల్లడించింది. ఇక, మరో రెండు రోజుల్లో గ్రూప్‌-2 పరీక్ష ప్రాథమిక ‘కీ’ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశామని కూడా వెల్లడించింది.

Editor