ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. ప్రజా పాలన దరఖాస్తుల అమ్మకాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తులు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైనన్ని దరఖాస్తులు అందుబాటులో ఉంచాల్సిందేనన్నారు. రైతు భరోసా, పింఛన్లపై అపోహలు వద్దని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పాత లబ్దిదారులందరికీ యథాతథంగా లబ్ది చేకూరుతుందని ముఖ్యమంత్రి స్పష్టత ఇచ్చారు.
ప్రజాపాలన నిర్వహణ పైన ముఖ్యమంత్రి రేవంత్ సమీక్ష చేసారు.దరఖాస్తుదారులకు అవసరమైనన్ని దరఖాస్తులను అందుబాటులో ఉంచాల్సిందేనని అధికారులను ఆదేశించారు. ప్రజా పాలన ఫామ్‌లు బయట అమ్ముతుండడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. దరఖాస్తుల కొరత లేకుండా అవసరమైనన్ని దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని సూచించారు. దరఖాస్తు చేసుకోవాలనుకునేవారికి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసారు. ఇప్పటి వరకు జరిగిన గ్రామసభలు, దరఖాస్తుల వివరాలు, ప్రజా పాలన దరఖాస్తులు స్వీకరిస్తున్న విధానం, ప్రజల్లో స్పందనకు సంబంధించి పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రైతుబంధు, పింఛన్ల పంపిణీ పై ముఖ్యమంత్రి స్పష్టత ఇచ్చారు. రైతుబంధు, పింఛన్లపై అపోహలకు గురి కావద్దని, పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా ఈ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. గతంలో లబ్ధి పొందని వారు, కొత్తగా లబ్ధి పొందాలనుకునేవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురి కావద్దని సూచించారు.
ప్రజా పాలన కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు విధిగా భాగస్వామ్యం కావాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోను ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతాయని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. దరఖాస్తు దారులకు కావాల్సిన ఏర్పాట్ల కల్పనలో ఎలాంటి లోటు రాకుండా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.
