యూపీలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చాక అభివృద్ధి ప్రాజెక్టుల్ని పరుగులు తీయిస్తున్న సీఎం యోగీ ఆదిత్యనాథ్.. మరో రికార్డు సృష్టించారు. నోయిడాతో పాటు గ్రేటర్ నోయిడా ప్రాంతాల్లో నిన్న ఒక్కరోజే ఏకంగా 124 ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంఖుస్ధాపనలు పూర్తి చేశారు.
నోయిడా స్టేడియంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో నోయిడా, గ్రేటర్ నోయిడా ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అమథారిటీ ఆధ్వర్యంలో రూ.1,719 కోట్ల విలువైన 124 అభివృద్ధి ప్రాజెక్టులను యోగీ ప్రారంభించారు, అలాగే మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు.
కేబుల్ బ్రిడ్జ్ తరహాలో నిర్మించిన పార్థాల ఫ్లైఓవర్ నుండి వేద్ వాన్ పార్క్ వరకు పలు ప్రాజెక్టులకు యోగీ ఆదిత్యనాథ్ ప్రారంభోత్సవాలు చేశారు. జనం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పార్థాల ఫ్లైఓవర్ ను రూ.84 కోట్లతో నిర్మించారు. నోయిడా నుండి గ్రేటర్ (పశ్చిమ) వరకు MP-3 రహదారిని కలుపుతుంది. ఢిల్లీ సిగ్నేచర్ బ్రిడ్జ్ తరహాలోనే ఇది కేబుల్ మోడల్ లో నిర్మించారు. ఇది 650 మీటర్ల పొడవుతో క్యారేజ్‌వేకి ఇరువైపులా మొత్తం 28 కేబుళ్లను వాడి నిర్మించారు. సెక్టార్ 78లో వేద్ వాన్ పార్క్ 12 ఎకరాల్లో రూ.22.68 కోట్లతో నిర్మించారు.
