గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అతలాకుతలం అవుతోంది. ముఖ్యంగా కాంగో రాజధాని కిన్షాసాలో భారీ వరదలు విలయం సృష్టిస్తున్నాయి. భారీ వరదల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో దాదాపుగా 120 మంది మరణించినట్లు రాయిటర్స్ తమ నివేదికలో పేర్కొంది. ఈ సంఖ్య ఎక్కువగానే ఉంటుందని సమాచారం తెలుస్తోంది.
భారీ వర్షాల కారణంగా కాంగోలో ప్రస్తుతం జన జీవితం పూర్తిగా స్తంభించిపోయింది. సెంట్రల్ ఆఫ్రికాలోని కాంగో దేశ రాజధాని కిన్షాసాలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వరదలు బీభత్సవం సృష్టించాయి. దాదాపుగా 1.5 కోట్ల జనాభా ఉన్న కన్షాసా భారీ వరదల వల్ల పూర్తిగా దెబ్బతింది. వరదలకు కొండచరియలు విరిగిపడి 120 మంది మరణించారు. ఇళ్లులు నేలమట్టం అయ్యాయి. కిన్షాసాలోన్నీ చాలా ప్రాంతాలు బురద నీటితో నిండిపోయాయి. ఇక నగరంలోని ప్రధాన రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి.
రాజధాని కిన్షాసాను ఇతర ప్రాంతాలతో కలిపే రోడ్లు వరద నీటితో మునిగిపోయాయి. కిన్షాసా, మటాడి యొక్క ప్రధాన ఓడరేవును కలిపే N1 హైవే పూర్తిగా జలమయమయింది. N1ని 3-4 రోజుల పాటు మూసివేస్తున్నట్లు కాంగో ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కాంగో ఆరోగ్య మంత్రి జీన్ జాక్వెస్ మీడియాతో మాట్లాడుతూ.. భారీ వరదల వల్ల 141 మంది మరణించినట్లు తెలిపారు. అయితే ఈ సంఖ్యను ఇతర విభాగాలతో క్రాస్ చెక్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో మూడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటిస్తున్నట్లు చెప్పారు.
