భారత మహిళా జట్టుతో జరిగిన తొలి టీ20లో ఆస్ట్రిలియా అమ్మాయిలు ఘనవిజయం సాధించారు. ముంబయి డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ ఆసీస్ 9 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. భారత్ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఆస్ట్రేలియా ఓపెనర్ బెత్ మనీ(89) అర్ధశతకంతో అదరగొట్టగా.. అలిసా హేలీ(37), తహిలా మెక్‌గ్రాత్(40) రాణించారు. ఫలితంగా 18.1 ఓవర్లోనే వికెట్ నష్టపోయి లక్ష్యాన్ని పూర్తి చేశారు. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు ఆసీస్ ముందు తేలిపోయారు. దేవికా వైద్య ఓ వికెట్ మినహా మిగిలినవారెవరూ ప్రభావవంతంగా బౌలింగ్ చేయలేకపోయారు.
173 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఆసీస్ జట్టుకు శుభారంభం దక్కింది. ఓపెనర్ బెత్, అలీసా తొలి వికెట్‌కు 73 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఇద్దరూ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ అదరగొట్టారు. వీరిలో బెత్ మనీ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. వరుస బౌండరీలతో స్టేడియాన్ని హోరేతెత్తించింది. ఓ పక్క బెత్ వేగంగా ఆడగా.. కెప్టెన్ అలీసా(87) కూడా అదే రీతిలో రెచ్చిపోయింది. వేగంగా ఆడుతున్న అలీసాను దేవికా వైద్య ఔట్ చేసింది. అనంతరం క్రీజులోకి వచ్చిన తహిలా మెక్‌గ్రాత్‌తో కలిసి బెత్ మనీ ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. తహిలా కూడా 29 బంతుల్లో 40 పరుగులతో నిలకడగా ఆడగా.. బెత్ మనీ 57 బంతుల్లో 89 పరుగులతో ఆకట్టుకున్నారు.
ఇందులో 16 బౌండరీలు ఉన్నాయి. ఇద్దరూ కలిసి లక్ష్యాన్ని సునాయసంగా పూర్తి చేశారు. చివరకు ఆస్ట్రేలియా 18.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 173 పరుగులు చేసింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత అమ్మాయిలు.. అనుకున్న స్థాయిలో రాణించలేదు. ఓ బ్యాటర్ కూడా అర్ధశతకం దాటలేదు. రిచా ఘోష్(36), దీప్తి శర్మ(36) ఇద్దరూ ఆకట్టుకునే ప్రదర్శన చేయడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఈ పెర్రీ 2 వికెట్లు తీయగా. కిమ్ గార్థ్, సథర్‌ల్యాండ్, అలనా కింగ్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
