Latest Posts

డిసెంబర్ 16న బంగ్లాదేశ్‌కు షేక్ హసీనా.. పాస్‌పోర్ట్, విమాన విజ్ఞప్తిని తోసిపుచ్చి, దేశంలో అడుగుపెడితే అరెస్ట్ తప్పదని హెచ్చరించిన ఢాకా సర్కార్!

విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్‌లో తలదాచుకుంటున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా, వచ్చే నెల డిసెంబర్ 16న ‘విజయ్ దివస్’ నాడు తిరిగి ఢాకాలో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఆగస్టు 5న తాను వెళ్లిన తరహాలోనే జాతీయ విమానయాన సంస్థ ‘బిమాన్ బంగ్లాదేశ్’ విమానాన్ని సమకూర్చాలన్న ఆమె ప్రతినిధి అభ్యర్థనను బంగ్లాదేశ్ ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. దేశం విడిచి వెళ్లినప్పుడే హసీనా పాస్‌పోర్ట్‌ను రద్దు చేశామని, కొత్త పాస్‌పోర్ట్ కోసం ఆమె సమర్పించిన దరఖాస్తును సైతం తోసిపుచ్చి ప్రయాణ పత్రాలు జారీ చేసే ప్రసక్తే లేదని ఢాకా సర్కార్ స్పష్టం చేసింది.

మరోవైపు, షేక్ హసీనా బంగ్లాదేశ్ గడ్డపై అడుగుపెట్టిన మరుక్షణమే అరెస్ట్ చేసి జైలుకు పంపుతామని అక్కడి మంత్రులు కఠిన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. 2024 ఆగస్టు అల్లర్లలో నిరసనకారుల మృతికి బాధ్యురాలిని చేస్తూ ప్రత్యేక ట్రైబ్యునల్ ఆమెకు మరణశిక్ష విధించిన నేపథ్యంలో, నేరస్థుల అప్పగింత ఒప్పందం ప్రకారమే ఆమెను తీసుకొస్తామని విదేశాంగ శాఖ సహాయ మంత్రి హుమయూన్ కబీర్ పేర్కొన్నారు. దేశ సరిహద్దుల్లో ఎక్కడ అడుగుపెట్టినా అరెస్ట్ తప్పదని మరో మంత్రి షామా ఒబైద్ తేల్చిచెప్పారు.

ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీపై నిషేధం అమల్లో ఉండగా, ప్రభుత్వ కక్షసాధింపు చర్యలను నిరసిస్తూ నవంబర్ 29, 30 తేదీల్లో 48 గంటల పాటు దేశవ్యాప్త బంద్ పాటించాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది. ఈ మొత్తం వ్యవహారంపై హసీనాతో కాకుండా నేరుగా భారత ప్రభుత్వంతోనే సంప్రదింపులు జరుపుతామని బంగ్లా ప్రధాని సలహాదారు పేర్కొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. హసీనా అప్పగింత అభ్యర్థనను భారత్ పరిశీలిస్తున్న నేపథ్యంలో, డిసెంబర్ 16న ఢాకాలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనన్న ఉత్కంఠ నెలకొంది.

Editor