దేశవాళీ క్రికెట్ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఢిల్లీ కెప్టెన్ ప్రియాన్ష్ ఆర్య సరికొత్త చరిత్ర సృష్టించాడు. తమిళనాడుతో డేలీ కాలేజ్ గ్రౌండ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన ప్రియాన్ష్, కేవలం 68 బంతుల్లోనే 181 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. తద్వారా టీ20 ఫార్మాట్‌లో ఓ భారత బ్యాటర్ సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోరుగా దీనిని తన పేరిట లిఖించుకున్నాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన అతను కేవలం 18 బంతుల్లోనే అర్ధశతకం, 36 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు.
ఈ అద్భుత ఇన్నింగ్స్‌లో ప్రియాన్ష్ ఆర్య ఏకంగా 19 సిక్సర్లు, 7 ఫోర్లు బాది రికార్డుల మోత మోగించాడు. ఈ క్రమంలో ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున కేఎల్ రాహుల్ సాధించిన 152 పరుగుల భారత రికార్డును ప్రియాన్ష్ అధిగమించాడు. అంతేకాకుండా ఒకే టీ20 ఇన్నింగ్స్‌లో 19 సిక్సర్లు బాదడం ద్వారా ఫిన్ అలెన్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును సమం చేశాడు.
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలోనే ఇది రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నమోదైంది. గత నెల సీఎస్ఏ ప్రో20 కప్‌లో టైటాన్స్ తరఫున లూన్-డ్రే ప్రిటోరియస్ సాధించిన 188 నాటౌట్ పరుగుల తర్వాత ప్రియాన్ష్ ఇన్నింగ్సే అత్యధికం. 19వ ఓవర్‌లో మణిమారన్ సిద్ధార్థ్ బౌలింగ్‌లో ప్రియాన్ష్ ఔటైనప్పటికీ, అతని విధ్వంసంతో ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 275 పరుగుల భారీ స్కోరు సాధించి, ముస్తాక్ అలీ ట్రోఫీ చరిత్రలో మూడో అత్యధిక జట్టు స్కోరును నమోదు చేసింది.
