హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు మెట్రో ప్రయాణికులకు చివరి మైలు కనెక్టివిటీ కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (PRTS)’ పేరుతో డ్రైవర్‌లెస్ పాడ్ ట్యాక్సీలను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. తొలి దశలో ఐటీ కారిడార్ పరిధిలోని కూకట్పల్లి నుంచి రాయదుర్గం, బయోడైవర్సిటీ జంక్షన్ మీదుగా నాలెడ్జి సిటీ వరకు సుమారు 35 కిలోమీటర్ల మేర ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. మొత్తం 64 స్టేషన్లు ఉండేలా రూపొందిస్తున్న ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, సమగ్ర రూట్ మ్యాప్, కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య (PPP) విధానంలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాల అధ్యయనం కొనసాగుతోంది. ప్రయాణికుల సంఖ్య, నిర్మాణ వ్యయం, భూకేటాయింపులు, డిపోల ఏర్పాటు వంటి అంశాలను పరిశీలిస్తున్న అధికారులు, డిసెంబరులో టెండర్ల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ వ్యవస్థలో చిన్న పరిమాణంలో ఉండే విద్యుత్ ఆధారిత డ్రైవర్‌లెస్ పాడ్ కార్లు ప్రత్యేక ఎలివేటెడ్ ట్రాక్‌లపై ప్రయాణిస్తూ, మెట్రో స్టేషన్ల నుంచి కార్యాలయాలు, వాణిజ్య ప్రాంతాలకు ప్రయాణికులను వేగంగా చేరవేస్తాయి.
ఇప్పటికే లండన్ హీత్రూ విమానాశ్రయం, అమెరికాలోని మార్గాంటౌన్ సహా చైనా, దక్షిణ కొరియా వంటి దేశాల్లో విజయవంతంగా నడుస్తున్న ఈ ఆటోమేటెడ్ పాడ్ వాహనాల తరహాలోనే హైదరాబాద్‌లోనూ అత్యుత్తమ సాంకేతికతను ఎంపిక చేయనున్నారు. తొలి దశలో ఐటీ కారిడార్‌లో పాడ్ ట్యాక్సీల పనితీరు, ప్రయాణికుల ఆదరణను బట్టి రెండో దశలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిసర ప్రాంతాలకు కూడా వీటిని విస్తరించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది.
