- దర్గా హొన్నూరులో భారీ పోలీసు బందోబస్తు
- భక్తులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
బొమ్మనహాల్, అక్టోబర్ 30, YES 9 TV న్యూస్,
మండలం లోని దర్గా హొన్నూరు గ్రామంలోని ప్రసిద్ధి చెందిన హజరత్ శర్మస్త్ వలి దర్గాకు కులమతాలకు అతీతంగా వేలాది మంది భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ఘర్షణలు చోటుచేసుకోకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు.జిల్లా ఎస్పీ, డీఎస్పీ ఆదేశాల మేరకు రాయదుర్గం గ్రామీణ సీఐ వెంకటరమణ నేతృత్వంలో శుక్రవారం పోలీసు సిబ్బందితో కలిసి దర్గా పరిసర ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భక్తుల రాకపోకలు, వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని వాహనాల తనిఖీ కేంద్రాలు, పార్కింగ్ స్థలాలు, రాకపోకల మార్గాలను పరిశీలించి ముందస్తు భద్రతా చర్యలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ భక్తులు పోలీసులకు సహకరించి సూచించిన మార్గాల్లోనే రాకపోకలు సాగించాలని, వాహనాలను కేటాయించిన పార్కింగ్ ప్రదేశాల్లోనే నిలపాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. దర్గా పరిసరాల్లో గొడవలు, అల్లర్లు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యంగా నిరంతర పోలీసు నిఘా, గస్తీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. శాంతియుత వాతావరణంలో దర్గా కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు.
