Latest Posts

ఢిల్లీలో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అరెస్ట్: కన్నాట్ ప్లేస్‌లో ‘తిరంగా యాత్ర’కు యత్నం.. ఎస్‌ఐఆర్ వివాదంలో ఉద్రిక్తత!

దేశ రాజధాని ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ సెంట్రల్ పార్క్‌లో ‘లెహ్రా దో తిరంగా’ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఎన్నికల ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)లో తీవ్ర అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు ఆయన ముంబై నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. శనివారం ఆయనను ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (ఎస్ఈఎం) కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం ఉండగా, దీప్కేను ప్రస్తుతం ఏ పోలీస్ స్టేషన్‌లో ఉంచారో స్పష్టత లేదని సీజేపీ లీగల్ సెల్ విభాగం ఆందోళన వ్యక్తం చేసింది.
కన్నాట్ ప్లేస్‌లోని సెంట్రల్ పార్క్ నిరసనలకు అధికారికంగా గుర్తింపు పొందిన ప్రదేశం కాదని, పైగా ఈ తిరంగా యాత్రకు న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్‌డీఎంసీ)తో పాటు ఢిల్లీ పోలీసుల నుంచి ఎలాంటి అనుమతులు లేవని అధికారులు తెలిపారు. ఆంక్షలు అమల్లో ఉన్న నిషిద్ధ ప్రాంతంలో అనుమతి లేకుండా జనసమీకరణ చేయడం చట్టవిరుద్ధమని ముందస్తు నోటీసులు జారీ చేసినప్పటికీ యాత్రకు ఉపక్రమించడంతోనే ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. అయితే తాను జాతీయ జెండాను చేతబూని శాంతియుతంగా నడుస్తుంటే ఏ చట్టాన్ని ఉల్లంఘించానని దీప్కే పోలీసులను నిలదీయగా.. జాతీయ జెండా ప్రదర్శనపై నిషేధం లేకపోయినా అనుమతి లేని ఊరేగింపులు, ర్యాలీలపై చట్టపరమైన ఆంక్షలు ఉంటాయని అధికారులు వివరించారు.
కాగా, ఎస్‌ఐఆర్ వివాదంపై సీజేపీ తలపెట్టిన ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీలో కొద్దిరోజులుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగి జాతీయ జెండాను ఎగురవేసిన ఆరోపణలపై ఇప్పటికే సీజేపీ సహ కన్వీనర్లు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకా అరెస్టై ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అలాగే ఇదే నిరసనల క్రమంలో మండీ హౌస్ వద్ద ఐసా (AISA) నాయకురాలు నేహా బోరాను సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని అనంతరం విడుదల చేశారు. ఒకే వారంలో అభిజీత్ దీప్కేను పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఇది రెండోసారి కావడంతో ఢిల్లీలో రాజకీయ వేడి మరింత రాజుకుంది.
Editor