Latest Posts

తెలంగాణలో జనసేనకు ఒక్క అవకాశం ఇవ్వండి: పట్టభద్రులకు పవన్ కళ్యాణ్ చేతులెత్తి విజ్ఞప్తి.. ‘గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ రథం ప్రారంభం!

తెలంగాణ యువత రాజకీయ ఆకాంక్షల సాకారం, ప్రజా సమస్యల శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా జనసేన పార్టీ పనిచేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తెలంగాణలో జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని పట్టభద్రులు, యువతను ఆయన చేతులెత్తి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇక్కడి యువత చేసిన పోరాటాలు, చేసిన త్యాగాలు చరిత్రలో చిరస్మరణీయమని కొనియాడిన పవన్.. రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు గడుస్తున్నా ప్రజల అనేక ఆకాంక్షలకు ఇంకా పరిష్కారం లభించలేదని, వారితో కలిసి పనిచేయాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు. ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావుకు మద్దతుగా హైదరాబాద్‌లో ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ ప్రచార రథాన్ని పవన్ కళ్యాణ్ ఘనంగా ప్రారంభించారు.
పార్టీ శ్రేణులు, పట్టభద్రులకు దిశానిర్దేశం చేసిన పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీ తెలంగాణ గడ్డపైనే ఆవిర్భవించిందని, ఇక్కడి ప్రజలతో పార్టీకి ఎంతో గాఢమైన అనుబంధం ఉందని గుర్తుచేశారు. ఈ క్రమంలో ప్రారంభించిన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్ వాహనం కేవలం ఎన్నికల ప్రచారానికే పరిమితం కాకుండా, పట్టభద్రుల సమస్యలు, ఆలోచనలు, ఉద్యోగ-ఉపాధి ఆశయాలను తెలుసుకునే సజీవ ప్రజావేదికగా నిలవాలని నిర్దేశించారు. ఈ ప్రత్యేక వాహనం ద్వారా అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావు 120 రోజుల పాటు క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లి వారితో నేరుగా మమేకం కానున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. యువత తమ సమస్యలు, రాజకీయ భాగస్వామ్యంపై సూచనలు అందించేందుకు ఈ వేదికను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
తన ప్రజా ప్రయాణ అనుభవాలను పంచుకుంటూ.. గతంలో ఆదిలాబాద్‌లో చేతిలో పెద్దగా డబ్బులు లేకున్నా ఒక బోరు బావి వేయించి చిన్న ప్రయత్నంగా మొదలుపెట్టిన సంకల్పం, నేడు ఆంధ్రప్రదేశ్‌లో రూ.30 వేల కోట్లతో ప్రతిష్టాత్మక ‘జల్ జీవన్ ధార’ పథకాన్ని నడిపించే స్థాయికి చేరిందని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. చిన్న ప్రయత్నమైనా చిత్తశుద్ధి ఉంటే మహోన్నత ప్రజా కార్యక్రమంగా మారుతుందనడానికి ఇదే నిదర్శనమని, ప్రజా అవసరాలను తీర్చడమే నిజమైన రాజకీయ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. కాగా, ఇదే కార్యక్రమంలో రాజకీయ నాయకులు, సామాజిక సేవకులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, క్రీడాకారులు మరియు డిజిటల్ మీడియా ప్రతినిధులు పలువురు జనసేన పార్టీ కండువా కప్పుకుని పార్టీలో చేరారు.
Posted Under AP
Editor