Latest Posts

కేంద్రానికి ఓబీసీ నేతల సంచలన అల్టిమేటం: కులగణన చేపట్టకుంటే డిసెంబర్ 14, 15న పార్లమెంట్ ముట్టడి.. దేశవ్యాప్త జనగణన బహిష్కరణకు హెచ్చరిక!

రాబోయే జాతీయ జనాభా లెక్కల (సెన్సస్) సేకరణలో ఓబీసీల కులాల వారీ వివరాలను నమోదు చేసేందుకు ప్రత్యేక కాలమ్‌ను తప్పనిసరిగా చేర్చాలని డిమాండ్ చేస్తూ బీసీ, ఓబీసీ సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన అల్టిమేటం జారీ చేశారు. గురువారం దేశ రాజధాని ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన 22 రాష్ట్రాల ప్రతినిధులతో నిర్వహించిన జాతీయ స్థాయి రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. కేంద్రం తమ డిమాండ్‌ను తక్షణమే అంగీకరించని పక్షంలో డిసెంబర్ 14, 15 తేదీల్లో దేశవ్యాప్తంగా లక్షలాది మందితో ‘చలో ఢిల్లీ’ చేపట్టి పార్లమెంట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.

కులగణన విషయంలో కేంద్ర ప్రభుత్వం పూటకో మాట మాట్లాడుతూ వెనుకబడిన వర్గాలను నిలువునా మోసం చేస్తోందని ఓబీసీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఇప్పటికైనా దిగిరాకపోతే భవిష్యత్తులో దేశవ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలను ఏకం చేసి జనగణన ప్రక్రియను పూర్తిగా బహిష్కరించే ఉద్యమానికి పిలుపునిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటి తరుణంలో కనుక బీసీ కులగణన జరగకపోతే భవిష్యత్తులో అది ఎప్పటికీ సాధ్యం కాదని ఆవేదన వ్యక్తం చేస్తూ, దేశంలో అత్యధిక జనాభా కలిగిన వెనుకబడిన వర్గాల హక్కుల కోసం మరో స్వాతంత్ర్య పోరాటం తరహాలో ఉద్యమిస్తామని గర్జించారు.

ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి దేశంలోని వివిధ రాజకీయ పార్టీల అగ్రనేతలు, సామాజిక ఉద్యమకారులు భారీ సంఖ్యలో తరలివచ్చి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ, ఎంపీ పప్పు యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు, మాజీ ఎంపీ రాజేష్ సైన్, స్వరాజ్ ఇండియా వ్యవస్థాపకుడు యోగేంద్ర యాదవ్, ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడు కేశన శంకర్ రావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. కేంద్రం మొండివైఖరి వీడి రాబోయే సెన్సస్‌లోనే బీసీల గణనను అధికారికంగా చేర్చాలని, లేనిపక్షంలో ఢిల్లీ వీధుల్లో విప్లవాత్మక పోరాటం తప్పదని ముక్తకంఠంతో హెచ్చరించారు.

Posted Under AP
Editor