అనంతపురం జిల్లా…
రాయదుర్గం నియోజకవర్గం..
మన మార్క్ పాలన శాశ్వతంగా గుర్తుండి పోవాలి.
– వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సూచన.
పదవులు కేవలం అలంకారప్రాయంగా మిగిలిపోకూడదని, తాము పనిచేసిన కాలంలో రైతులకు మేలు జరిగేలా చర్యలు చేపట్టి తమ మార్క్ శాశ్వతంగా గుర్తుండిపోయేలా పని చేయాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులకు సూచించారు. రాయదుర్గం వ్యవసాయ మార్కెట్ యార్డులో విధులు నిర్వహిస్తూ పదోన్నతిపై వెళ్తున్న గ్రేడ్-2 కార్యదర్శి శ్రీనివాసులును మంగళవారం మార్కెట్ యార్డు కార్యాలయంలో ఎమ్మెల్యే కాలవ ఘనంగా సన్మానించారు. అనంతరం మార్కెట్ యార్డు అధికారులు, కమిటీ సభ్యులతో కలిసి యార్డు అభివృద్ధి, రైతులకు అందుతున్న సేవలపై ఆయన చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హనుమంతరెడ్డి నాయకత్వంలో రాయదుర్గం మార్కెట్ యార్డు సేవలు క్రమంగా విస్తరిస్తున్నాయని తెలిపారు. మార్కెట్ యార్డు అనుబంధంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు చేపట్టామని చెప్పారు. కనేకల్లులో సబ్ మార్కెట్ ఏర్పాటుకు తాను మంత్రిగా ఉన్న సమయంలో ఎంపిక చేసిన స్థలంలో ప్రస్తుతం రూ.60 లక్షలతో గోడౌన్ నిర్మాణంతో పాటు రహదారి సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. రాయదుర్గానికి తాజాగా రైతు బజార్ మంజూరు చేయించామని, త్వరలోనే భూమిపూజ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. రైతు బజార్ ప్రతి మార్కెట్ యార్డుకు మణికిరీటం లాంటిదని అభివర్ణించారు. రైతు బజార్ ద్వారా ప్రతిరోజూ వందలాది మంది రైతులకు సేవలు అందించే అవకాశం ఉంటుందని చెప్పారు. రైతులు తమ పంట ఉత్పత్తులను నేరుగా రైతు బజార్‌కు తీసుకువచ్చి వినియోగదారులకు విక్రయించుకునే అవకాశం ఉంటుందన్నారు. దీనివల్ల మధ్యవర్తుల ప్రమేయం తగ్గి రైతులకు తమ ఉత్పత్తులకు మెరుగైన ధర లభించడంతో పాటు వినియోగదారులకు కూడా నాణ్యమైన నిత్యావసర వస్తువులు తక్కువ ధరకే అందే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం రైతు వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసే ఉత్పత్తులు మధ్యవర్తులు, హోల్‌సేల్ వ్యాపారులు, చిల్లర వర్తకుల చేతులు మారే క్రమంలో వినియోగదారుడికి అధిక ధరకు చేరుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దీనివల్ల రైతుకు తన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కకపోగా, మధ్యవర్తులే అధికంగా లాభపడుతున్నారని అన్నారు. రైతు బజార్ ఏర్పాటు ద్వారా రైతులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించుకునే వెసులుబాటు కలుగుతుందని వివరించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో రైతు బజార్‌ను సమర్థవంతంగా నిర్వహిస్తే రైతులకు మరింత ప్రయోజనం చేకూర్చిన వారవుతారని సూచించారు. రైతులకు మరింత ప్రయోజనం చేకూరేలా మార్కెట్ యార్డు సేవలను విస్తరించేందుకు కమిటీ సభ్యులు చొరవ తీసుకోవాలన్నారు. పదవిలో ఉన్న కాలంలో రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టి తమ సేవలను చిరస్మరణీయంగా నిలుపుకోవాలని కాలవ శ్రీనివాసులు సూచించారు.
