Latest Posts

“మీరు చేసింది ప్రచారమే.. న్యాయం కాదు!”: జాన్వీ కపూర్ డీప్‌ఫేక్ వీడియోపై సినీ ప్రముఖులకు రామ్‌గోపాల్ వర్మ ఘాటు చురకలు.. ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు!

‘దేవర’ చిత్రంలోని ‘చుట్టమల్లే’ పాటకు సంబంధించి నటి జాన్వీ కపూర్ డీప్‌ఫేక్ వీడియో వివాదంపై సంచలన దర్శకుడు రామ్‌‌గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సున్నితమైన అంశంపై సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందించిన తీరును ఆర్జీవీ తీవ్రంగా తప్పుపట్టారు. సెలబ్రిటీలు పెట్టిన వరుస పోస్టులు, ట్వీట్ల వల్ల బాధితురాలికి న్యాయం జరగకపోగా.. ఆ అభ్యంతరకర కంటెంట్‌కు అనవసరమైన ఉచిత ప్రచారం కల్పించినట్లయిందని ఆయన కుండబద్దలు కొట్టారు.

సెలబ్రిటీల స్పందన కారణంగానే ఆ వీడియో గురించి తెలియని సాధారణ ప్రజలకు కూడా తెలిసిందని, దీనివల్ల కోట్లాది మంది ఆ వీడియో కోసం వెతికి చూసే పరిస్థితులు తలెత్తాయని వర్మ విమర్శించారు. ఇది బాధితురాలికి అండగా నిలవడం కాదని, పరోక్షంగా మరింత మానసిక క్షోభ, నష్టం కలిగించడమేనని అభిప్రాయపడ్డారు. చట్టప్రకారం సైబర్ క్రైమ్ విభాగం సాయంతో ముందుగా ఆ నీచమైన వికృత చేష్టలకు పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేయించాలని, వాడిని పట్టుకున్న తర్వాత ఆ విజయాన్ని బయటకు చెబితే దానికి ఒక అర్థం ఉండేదని హితవు పలికారు.

అసలు దోషిని పట్టుకోకుండా బాధితురాలి పేరును పదే పదే ప్రస్తావిస్తూ పోస్టులు పెట్టడం వల్ల మరింత రచ్చ జరిగిందని ఆర్జీవీ ధ్వజమెత్తారు. ఇలాంటి ఘటనల్లో బాధితురాలి గుర్తింపును బహిరంగంగా హైలైట్ చేయడం కూడా చట్టపరంగా నేరమే అవుతుందని ఆయన గుర్తుచేశారు. మొత్తం మీద సెలబ్రిటీలు చూపించిన అత్యుత్సాహం బాధితురాలికి సాంత్వన చేకూర్చడం కంటే, ఆ అశ్లీల వీడియోకి భారీ స్థాయిలో పబ్లిసిటీ ఇచ్చేందుకే ఉపయోగపడిందని వర్మ తనదైన శైలిలో చురకలంటించారు.

Editor