Latest Posts

“ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం చంద్రబాబుతోనే సాధ్యం”: బుర్రిపాలెంలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసల జల్లు.. మరో 6 లక్షల ఇళ్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్!

ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్త కలలు, ఆకాంక్షలను నెరవేర్చగల సమర్థ నాయకత్వం ఒక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసించారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గ పరిధిలోని బుర్రిపాలెం గ్రామంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) కింద 3 లక్షల ఇళ్ల నిర్మాణ పనుల శంకుస్థాపన సభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. చంద్రబాబు డైనమిక్, డెడికేటెడ్, డెసిసివ్ విజన్ కలిగిన గొప్ప నాయకుడని కొనియాడుతూ.. ఆయన నిబద్ధత, కఠోర శ్రమతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ఎదగడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఉమ్మడి రాష్ట్రాన్ని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దిన అనుభవంతో, ఇప్పుడు అమరావతి వేదికగా క్వాంటం, ఏఐ, డేటా సెంటర్ల రంగాల్లో సరికొత్త విప్లవానికి శ్రీకారం చుడుతున్నారని పేర్కొన్నారు.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణ రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, కేంద్రం పంపిన నిధులను దారి మళ్లించి జగన్ పేదల సొంతింటి కలను నాశనం చేశారని చౌహాన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుతం నిబంధనల ప్రకారం రాష్ట్రానికి 76 వేల ఇళ్లు మాత్రమే రావాల్సి ఉన్నప్పటికీ.. చంద్రబాబు ప్రత్యేక చొరవతో కేంద్రం తొలి విడతగా 3 లక్షల గృహాలను మంజూరు చేసిందని వివరించారు. బాబు గారు అడిగిన మేరకు ఈ 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తికాగానే, మరో 6 లక్షల ఇళ్లను విడతలవారీగా కేటాయించి రాష్ట్రంలోని నిరుపేదలందరికీ పక్కా ఇళ్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా బుర్రిపాలెంలో అత్యాధునిక 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం గొప్ప మార్పు అని కొనియాడారు.

కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏపీని 360 డిగ్రీల కోణంలో పరుగులు పెట్టిస్తోందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. మోదీ-బాబు కలిస్తే ఒకటి ప్లస్ ఒకటి రెండు కాదు, పదకొండు అవుతుందని చమత్కరించారు. అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంటులో చట్టం చేయడంతో పాటు రూ. 15,000 కోట్ల ఆర్థిక సాయం అందించామని, పోలవరం ప్రాజెక్టును 100 శాతం కేంద్ర నిధులతో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. మహిళల కోసం ‘లఖ్‌పతి దీదీ’ల సంఖ్యను 60 లక్షలకు పెంచుతామని, పీఎం కిసాన్‌తో పాటు ‘అన్నదాత సుఖీభవ’ కలిపి రైతులకు ఏటా రూ. 20,000 ఆర్థిక సాయం అందిస్తూ వ్యవసాయ రంగాన్ని హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు.

Posted Under AP
Editor