Latest Posts

“తెలంగాణకు బీసీ సీఎం అవుతారు.. రేవంత్, రాహుల్ మద్దతిస్తారు!”: శంషాబాద్ సభలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు.. అవసరమైతే హక్కులు లాక్కుంటామని హెచ్చరిక!

దేశవ్యాప్తంగా ఓబీసీ కులగణన చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ శంషాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అత్యంత కీలక, సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్తులో బీసీ వర్గానికి చెందిన వ్యక్తే ముఖ్యమంత్రి అవుతారని ఆయన ఘంటాపథంగా స్పష్టం చేశారు. ఈ చారిత్రాత్మక నిర్ణయానికి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం సంపూర్ణ మద్దతు ఇస్తారని పేర్కొన్నారు. బీసీల రాజ్యాధికారం, హక్కుల సాధన కోసం ఇంత ధైర్యంగా గళమెత్తడానికి రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేలే కారణమని ఆయన కొనియాడారు.

కాంగ్రెస్ పార్టీ అనేది కేవలం ఒక ప్రాంతానికో, ఒక వ్యక్తికో లేదా ఒక్క కులానికో పరిమితమైన వేదిక కాదని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అన్ని వర్గాలను సమదృష్టితో ఆదరించే ప్రజా పార్టీ అని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఓబీసీల అభివృద్ధి కోసం పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలకు అగ్రవర్ణాల నాయకులు కూడా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారని గుర్తుచేశారు. మంత్రివర్గంలో త్వరలోనే బీసీలకు ప్రాధాన్యం పెంచుతామని, భవిష్యత్ ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్లలోనూ వారి వాటాను భారీగా పెంచుతామని ప్రకటించారు. అన్ని వర్గాల మద్దతుతోనే తమకు రావాల్సిన వాటాను సాధించుకుంటామని, అవసరమైతే హక్కులను లాక్కుంటామని ఘాటుగా హెచ్చరించారు.

రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి బీసీ కులగణన సర్వేను విజయవంతంగా నిర్వహించి చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని పీసీసీ చీఫ్ ప్రశంసించారు. గతంలో దివంగత నేతలు పీవీ నరసింహారావు, మర్రి చెన్నారెడ్డిల తరహాలోనే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కులగణనపై ఏకగ్రీవ తీర్మానం ఆమోదింపజేసి కేంద్రానికి పంపారని తెలిపారు. రాష్ట్రం నుంచి గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు ప్రధాని మోదీ, అమిత్ షాల వద్దకు వెళ్లి తెలంగాణ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదింపజేసే ధైర్యం చేయలేకపోతున్నారని విమర్శించారు. కేంద్రం గనుక దీనిని ఆమోదిస్తే యావత్ భారతదేశానికే తెలంగాణ ఒక రోల్ మోడల్‌గా నిలుస్తుందని మహేష్ కుమార్ గౌడ్ పునరుద్ఘాటించారు.

Editor