Latest Posts

రేపు తెలంగాణ కేబినెట్ కీలక భేటీ: ఉద్యోగులకు 2 డీఏల ప్రకటన.. ఇందిరమ్మ బీమా, మెట్రో, మూసీ ప్రాజెక్టులపై కీలక నిర్ణయాలు!

తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం సాయంత్రం 3 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయతలపెట్టిన పలు నూతన సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులపై కూలంకషంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా పాలనాపరమైన సంస్కరణలు, ప్రాజెక్టుల పురోగతిపై మంత్రులతో సీఎం సమగ్రంగా సమీక్షించనున్నారు.
ఈ కేబినెట్ భేటీలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం తీపి కబురు అందించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలను (మొదటి డీఏ 3.64%, రెండో డీఏ 2.74%) మంజూరు చేసేందుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది. దీనితో పాటు పేద కుటుంబాల్లోని యజమాని మరణిస్తే రూ.5 లక్షల ఆర్థిక భరోసా కల్పించే ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. ఈ పథకాన్ని నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా అధికారికంగా ప్రారంభించాలని సర్కార్ భావిస్తోంది. అలాగే డిసెంబర్‌లో హైదరాబాద్ వేదికగా జరగనున్న గ్లోబల్ సమ్మిట్ సన్నాహకాలపై కూడా చర్చించనున్నారు.
మరోవైపు రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేసే అంశంపై కె. కేశవరావు కమిటీ సమర్పించిన నివేదికను కేబినెట్ పరిశీలించనుంది. దీంతోపాటు నూతన చేయూత పెన్షన్ల మంజూరు, రాజీవ్ యువ వికాసం, హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, ఇందిరమ్మ చీరల పంపిణీ విధివిధానాలపై మంత్రివర్గం స్పష్టతనివ్వనుంది. అదే విధంగా రాష్ట్రంలోని పలు కీలక సాగునీటి ప్రాజెక్టులు, బ్యారేజీల పునరుద్ధరణ పనుల పురోగతిపై ఈ భేటీలో సమగ్ర సమీక్ష జరగనుంది.
Editor