Latest Posts

సుదర్శన్ థియేటర్‌లో ‘ది ప్యారడైజ్’ చూసిన కేటీఆర్: అణచివేతపై సామాన్యుడి పోరాటమే ఈ చిత్రం అంటూ ప్రశంసల జల్లు!

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట ఇచ్చిన విధంగానే నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ను వీక్షించారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని ప్రముఖ సుదర్శన్ థియేటర్‌లో శనివారం రాత్రి సెకండ్ షోను పార్టీ నేతలతో కలిసి సాధారణ ప్రేక్షకుల మధ్య కూర్చుని ఆయన తిలకించారు. కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు ఈ చిత్రాన్ని చూశారు. థియేటర్ వద్ద కేటీఆర్‌కు అభిమానులు, సినీ ప్రేక్షకులు ఘన స్వాగతం పలికారు.

సినిమా వీక్షణ అనంతరం కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా (ట్విట్టర్/X) స్పందిస్తూ చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. సమాజంలో అన్యాయం, అణచివేత ఎదురైనప్పుడు ఆత్మగౌరవం మరియు అస్తిత్వ పరిరక్షణ కోసం సామాన్యులు ఏ విధంగా తిరగబడతారో ఈ చిత్రంలో అద్భుతంగా ఆవిష్కరించారని కొనియాడారు. “సందర్భం వస్తే గడ్డిపోచలు సైతం గడ్డపారలుగా మారతాయి” అనే బలమైన సందేశాన్ని అందించిన యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకు కేటీఆర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.

కథానాయకుడి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి అద్భుతంగా నటించిన మిత్రుడు నానికి ఆయన మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యంగా ఈ చిత్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హావభావాలు, రాజకీయ శైలిని ప్రతిబింబించేలా ఉన్న ‘ఎమ్మెల్యే శంకరన్న’ పాత్రను పోషించిన నటుడు ప్రియదర్శి నటనను కేటీఆర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. “చావు నోట్లో తలపెట్టయినా సరే.. మీకు గుర్తింపు తెస్తా” అనే డైలాగ్‌ను ప్రస్తావిస్తూ, ఆలోచింపజేసే సామాజిక అంశాలను తెరకెక్కించినందుకు చిత్ర యూనిట్‌కు ఆయన అభినందనలు తెలిపారు.

Editor