సూర్య 50వ సినిమా ‘రోలెక్స్’.. లోకేష్ కనగరాజ్‌తో మరోసారి జోడీ కుదిరేనా?

తమిళ స్టార్ హీరో సూర్య వరుస విజయాలతో జోరు మీదున్నారు. మాస్ యాక్షన్ కథలతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే సినిమాలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే ‘కరుప్పు’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్‌’ వంటి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న సూర్య.. ఇప్పుడు తన 50వ సినిమాపై ఫ్యాన్స్‌లో ఆసక్తిని పెంచుతున్నారు. సూర్య 50వ చిత్రాన్ని లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘రోలెక్స్’ పేరుతో తెరకెక్కించే అవకాశం ఉందన్న వార్తలు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

ప్రస్తుతం సూర్య చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. జితు మాధవన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సూర్య 47’ ఇప్పటికే షూటింగ్ దశలో ఉంది. ‘ఆవేశం’తో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న జితు మాధవన్‌తో సూర్య చేస్తున్న ఈ సినిమా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. అనంతరం టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘సూర్య 48’ తెరకెక్కుతోంది. ‘జై భీమ్’ తర్వాత సూర్య, జ్ఞానవేల్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తుండగా.. కయాదు లోహర్ కథానాయికగా నటిస్తున్నట్లు సమాచారం.

ఇక సూర్య 49వ సినిమాకు హెచ్. వినోత్ దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నట్లు తాజా రిపోర్టులు చెబుతున్నాయి. ‘జన నాయకన్’ వంటి భారీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించిన హెచ్. వినోత్‌తో సూర్య తొలిసారి కలిసి పనిచేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కూడా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండనుందని, వామికా గబ్బి హీరోయిన్‌గా నటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. వీటి తర్వాత సూర్య 50వ సినిమా కోసం లోకేష్ కనగరాజ్‌తో ‘రోలెక్స్’ తెరకెక్కితే.. ఈ కాంబినేషన్‌పై అంచనాలు మరింత పెరగడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.

Editor