శృతి హాసన్‌కు భారీ ఊరట.. డీప్‌ఫేక్‌ వీడియోలపై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు

నటి శృతి హాసన్ దాఖలు చేసిన AI డీప్‌ఫేక్‌ పిటిషన్‌పై బాంబే హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ ఆమె ముఖాన్ని ఉపయోగించి రూపొందించిన నకిలీ, అశ్లీల డీప్‌ఫేక్‌ వీడియోలను ఇంటర్నెట్‌ నుంచి వెంటనే తొలగించాలని సోషల్ మీడియా సంస్థలను కోర్టు ఆదేశించింది. యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, ఎక్స్‌ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ఉన్న అభ్యంతరకర కంటెంట్‌ను తొలగించాలని స్పష్టం చేసింది.

గత జూన్‌లో గుర్తుతెలియని వ్యక్తులు శృతి హాసన్ ముఖాన్ని అసభ్యకర వీడియోలకు మార్ఫింగ్ చేయడంతో పాటు, ఆమె అనుమతి లేకుండా నకిలీ సోషల్ మీడియా ఖాతాలను సృష్టించి బ్రాండ్ ప్రమోషన్లు, వస్తువుల విక్రయాలకు పాల్పడ్డారు. దీంతో తన ప్రతిష్టకు భంగం కలిగించడంతో పాటు, తన పేరు మరియు గుర్తింపును అక్రమంగా ఉపయోగిస్తున్నారంటూ శృతి హాసన్ ఆగస్టులో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో రూ.15 కోట్ల నష్టపరిహారం కోరుతూ ఆమె దావా వేశారు.

ఈ కేసును విచారించిన జస్టిస్ మాధవ్ జామదార్.. శృతి హాసన్ వాదనలను సమర్థిస్తూ, ఇలాంటి తప్పుడు కంటెంట్‌ ఆన్‌లైన్‌లో కొనసాగితే ఆమె ప్రతిష్టకు తిరిగి పూడ్చలేని నష్టం వాటిల్లే అవకాశం ఉందని పేర్కొన్నారు. కేవలం ఆర్థిక పరిహారం చెల్లించడం ద్వారా ఇలాంటి నష్టాన్ని భర్తీ చేయలేమని, వ్యక్తిగత గౌరవం, గోప్యతకు రాజ్యాంగపరమైన రక్షణ ఉందని కోర్టు స్పష్టం చేసింది. అలాగే నకిలీ ఖాతాలను నిర్వహిస్తున్న వ్యక్తుల వివరాలను వెల్లడించాలని సంబంధిత ప్లాట్‌ఫామ్‌లను ఆదేశించింది. AI దుర్వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఈ తీర్పు సెలబ్రిటీల డిజిటల్ హక్కులు, గోప్యతకు ప్రాధాన్యతను చాటిచెప్పింది.

Editor