నిర్వహణ లేక శిథిలావస్థకు చేరుతున్న రూ.కోట్ల విలువైన ప్రాజెక్టు
10 వేల ఎకరాలకు సాగునీరు.. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి: రైతు సంఘం
ముదిగుబ్బ: దేశంలోనే తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో సత్యసాయి జిల్లా ఒకటని, నిత్యం కరువు పరిస్థితులతో రైతులు అప్పుల భారాన్ని మోస్తూ, ఉపాధి కోసం వలసలు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని రైతు సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో వ్యవసాయంపై ఆధారపడిన వెనుకబడిన ప్రాంతమైన ముదిగుబ్బ మండలానికి యోగివేమన జలాశయం ప్రధాన జలవనరు అని తెలిపారు. తాగునీరు, సాగునీరు, పశువులకు నీటి అవసరాలను తీర్చగలిగే ఈ ప్రాజెక్టు నేడు పాలకుల నిర్లక్ష్యంతో శిథిలావస్థకు చేరుతోందని విమర్శించారు.
రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ. హరి, జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి పెద్దన్న యోగివేమన ప్రాజెక్టును సందర్శించి ప్రాజెక్టు పరిస్థితిని పరిశీలించారు. ప్రాజెక్టు పరిసరాలు, కాలువలు, భవనాలు, రహదారి, మౌలిక వసతుల పరిస్థితులను పరిశీలించారు.
ఏ. హరి మాట్లాడుతూ.. 2001లో శంకుస్థాపన చేసిన యోగివేమన ప్రాజెక్టు సుమారు 0.9 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 10 వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో నిర్మించబడిందన్నారు. కుడి కాలువ ద్వారా 7,215 ఎకరాలు, ఎడమ కాలువ ద్వారా 2,800 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందన్నారు.
ఇంతటి ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు నిర్వహణను ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయని విమర్శించారు. 14 మంది సిబ్బంది ఉండాల్సిన చోట ఒక్కరు మాత్రమే ఉండటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. సుమారు 18 కిలోమీటర్ల పొడవైన కుడి, ఎడమ కాలువల్లో చెట్లు, చెదారం పెరిగిపోయినా పట్టించుకునే నాథుడు లేడని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రాజెక్టు దిగువన ఉన్న కొన్ని గ్రామాల్లో రైతుల పొలాల మీదుగా కాలువలు వెళ్లినా ఇప్పటికీ వారికి నష్టపరిహారం అందలేదని రైతు సంఘం నాయకులు తెలిపారు. కాలువల కోసం భూములు కోల్పోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రాజెక్టు వద్ద కనీసం లైటింగ్ సౌకర్యం లేకపోవడం, ప్రాజెక్టుకు వెళ్లే రహదారి సరిగా లేకపోవడం, ప్రాజెక్టు పరిధిలోని భవనాలు పాడుపడి శిథిలావస్థకు చేరుకోవడం పరిస్థితికి అద్దం పడుతోందన్నారు. నీటి లీకేజీలను అరికట్టేందుకు ఇటీవల రూ.3.96 కోట్లతో టెండర్లు పిలిచి పనులు చేపట్టినట్లు తెలిపారు. అయితే లీకేజీ పనులతో పాటు ప్రాజెక్టు సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించాలని కోరారు.
రైతులకు సాగునీటి సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఏ. హరి అన్నారు. మరోవైపు రాయలసీమను లక్ష కోట్ల రూపాయలతో హార్టికల్చర్ హబ్‌గా మారుస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. అందుబాటులో ఉన్న సాగునీటి వనరులను అభివృద్ధి చేసి రైతులకు వ్యవసాయంలో అండగా నిలవకుండా, సాగు గిట్టుబాటు కావడం లేదనే పేరుతో సోలార్ ప్రాజెక్టుల కోసం రైతులను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించే విధంగా చర్యలు చేపట్టడం రైతుల హక్కులను కాలరాయడమేనని విమర్శించారు.
సోలార్ ప్రాజెక్టుల పేరుతో రైతులను మభ్యపెట్టొద్దు
సోలార్ ప్రాజెక్టుల కోసం రైతుల భూములను ప్రైవేట్ కంపెనీలకు దీర్ఘకాలికంగా అప్పగించే విధంగా ప్రభుత్వం ప్రోత్సహించడం సరికాదని రైతు సంఘం నాయకులు అన్నారు. సంవత్సరానికి రూ.30 వేల కౌలు ఇస్తామని చెప్పి 29 సంవత్సరాల 11 నెలల పాటు అగ్రిమెంట్లు చేసుకునే విధంగా రైతులను ఒప్పించడం వల్ల భవిష్యత్తులో రైతులు తమ భూములపై హక్కులు, నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల భూములను కాపాడాల్సిన ప్రభుత్వం, ప్రైవేట్ కంపెనీలకు అప్పగించే విధానాలకు బదులుగా సాగు ద్వారా రైతులకు స్థిరమైన ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
జంగాలపల్లి పెద్దన్న మాట్లాడుతూ.. యోగివేమన ప్రాజెక్టును కేవలం నీటి నిల్వ ప్రాంతంగా కాకుండా మండల ప్రజలకు ఉపయోగపడే పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరారు. ప్రాజెక్టు పరిసరాల్లో పార్కు, వాకింగ్ ట్రాక్, లైటింగ్, పచ్చదనం, కూర్చునే సౌకర్యాలు ఏర్పాటు చేస్తే ప్రజలకు ఆహ్లాదకరమైన ప్రదేశంగా మారుతుందన్నారు.
అదేవిధంగా ప్రాజెక్టు కాలువల నిర్వహణ, రహదారి సౌకర్యం, భవనాల పునరుద్ధరణ, లైటింగ్ వంటి మౌలిక వసతులను కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా రైతుల పక్షాన నిలబడి యోగివేమన జలాశయంతో పాటు జిల్లాలోని అన్ని జలాశయాలకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని కోరారు. కాలువల కోసం భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందించి, వేలాది మంది రైతులకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
