విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు విశేష కృషి చేస్తున్న యువనేత, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటనను విజయవంతం చేయాలని ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. రాయదుర్గం పట్టణంలోని తన స్వగృహంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నారా లోకేష్ పర్యటనకు సంబంధించి పార్టీ తరఫున భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రాయదుర్గం పట్టణంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి యువనేతకు ఘన స్వాగతం పలుకుతారన్నారు. లోకేష్ నాయకత్వానికి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. వెనుకబడిన రాయదుర్గం ప్రాంత అభివృద్ధికి చంద్రబాబుతో పాటు లోకేష్ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. 2014–19 మధ్య చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం రాయదుర్గం నియోజకవర్గానికి అభివృద్ధిని పరిచయం చేసిందన్నారు. ఐదేళ్ల తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ అభివృద్ధిని మరింత వేగంగా కొనసాగిస్తోందన్నారు. ముఖ్యంగా నారా లోకేష్ సహకారంతో నియోజకవర్గంలో విద్యారంగ అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు.
లోకేష్ జాతీయ రాజకీయాల్లో అత్యంత ప్రతిభావంతమైన యువ నాయకుడిగా ఎదుగుతున్నారని పేర్కొన్నారు. రాయదుర్గంలో లోకేష్ పర్యటనను పార్టీ బలాన్ని, బలగాన్ని చాటుకునే సువర్ణావకాశంగా తాము భావిస్తున్నామన్నారు. సాధారణంగా అధికారంలో ఉన్న నాయకుల పర్యటనలకు ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుందని, అయితే లోకేష్ పర్యటనకు అన్ని ఏర్పాట్లను పార్టీ తరఫున చేస్తున్నామన్నారు. ప్రభుత్వ అధికారాన్ని, యంత్రాంగాన్ని ఎక్కడా వాడుకోలేదన్నారు. కనేకల్లు క్రాస్ లో జరిగే కార్యక్రమంలో సుజలాన్ సంస్థ ఏర్పాటు చేయబోయే 300 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్‌కు ఆయన శంకుస్థాపన వేస్తారన్నారు. అనంతరం నల్లంపల్లి సమీపంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో దాదాపు మూడు గంటల పాటు ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తారని చెప్పారు. ఈ సమీక్షలో పార్టీ నాయకులు, కార్యకర్తల తమ అభిప్రాయాలను, స్థానిక పరిస్థితులను నేరుగా లోకేష్ బాబుకు వివరించే అవకాశం ఉంటుందన్నారు. తద్వారా రాయదుర్గం నియోజకవర్గంలో భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివృద్ధి, పార్టీ కార్యక్రమాలపై ఆయనకు మరింత స్పష్టత వస్తుందన్నారు.
రాయదుర్గం విద్యారంగంపై లోకేష్ మార్క్
విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నారా లోకేష్ విద్యా వ్యవస్థలో అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే కాలవ తెలిపారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి విద్యార్థులు అధికంగా ఆధారపడే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచడంతో పాటు మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని చెప్పారు. గత డీఎస్సీ ద్వారా అనంతపురంజిల్లా పరిధిలో 748 మంది ఉపాధ్యాయులను నియమించగా, అందులో రాయదుర్గం నియోజకవర్గానికి 246 మందిని కేటాయించారన్నారు. అదేవిధంగా 21 పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగా అప్‌గ్రేడ్ చేశారని తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా 424 మంది అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించనుండగా, అందులో రాయదుర్గం నియోజకవర్గానికే 178 మంది వస్తారన్నారు. ‘మనబడి–మన భవిష్యత్తు’ కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. జిల్లా వ్యాప్తంగా 372 పాఠశాలలను ఎంపిక చేయగా, రాయదుర్గం నియోజకవర్గంలోనే 94 ఉన్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా రూ.360 కోట్లతో 588 అభివృద్ధి పనులు చేపడుతుండగా, రాయదుర్గం నియోజకవర్గంలో రూ.92 కోట్లతో 120 పనులు చేస్తున్నట్లు వివరించారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యా ప్రమాణాల పెంపు ద్వారా పేద విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. వెనుకబడ్డ రాయదుర్గం నియోజకవర్గంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్‌కు ప్రత్యేకమైన ప్రేమ, అభిమానం ఉన్నాయన్నారు. అందుకే ఈ ప్రాంతానికి విద్య, అభివృద్ధి రంగాల్లో ఇంత ప్రాధాన్యత లభిస్తోందన్నారు. నారా లోకేష్ పర్యటనను విజయవంతం చేసేందుకు ఎన్. డి. ఏ. కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి రాయదుర్గం గడ్డపై బలాన్ని చాటాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. లోకేష్ బాబు రాయదుర్గం నియోజకవర్గం పర్యటన వివరాలను ఆయన తెలియజేశారు.
లోకేష్ బాబు పర్యటన వివరాలు.
ఉదయం ఎనిమిదిన్నర గంటలకు బళ్లారి సమీపంలోని జిందాల్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతారు. అక్కడ నుండి నేరుగా రాయదుర్గం బయలుదేరి వస్తారు. మార్గమధ్యలో సుజలాన్ కంపెనీ ఏర్పాటుచేసిన బ్లేడ్ స్థాక్ యార్డ్ ను సందర్శిస్తారు. అక్కడ ఐదు నిమిషాల కార్యక్రమం ముగిశాక ఉదయం 10:45 గంటలకు రాయదుర్గం పట్టణ శివారులోని చంద్రబాబు నాయుడు పార్క్ వద్దకు చేరుకుంటారు. అక్కడ నుండి ఉదయం 11:50 గంటలకు కనేకల్లు క్రాస్ చేరుకుని, సుజలాన్ కంపెనీ ఏర్పాటు చేయబోయే పవన విద్యుత్తు ప్లాంట్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం నల్లంపల్లి వద్ద ఏర్పాటుచేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశ స్థలికి చేరుకొని మూడు గంటల పాటు నాయకులు, కార్యకర్తలతో ఆయన ముచ్చటిస్తారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలాకులు గుర్రప్ప , మార్కెట్ యార్డ్ చైర్మన్ హనుమంత రెడ్డి, తిమ్మరాజు తదితరులు పాల్గొన్నారు.
